
కోరుట్ల చిన్నారి హత్య కేసులో చిన్నమ్మే నిందితురాలు!
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితాక్షి కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితురాలు మమతను విచారిస్తున్న పోలీసులు, ఇవాళ.. లేదంటే రేపు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
కోరుట్ల ఆదర్శనగర్ పాప హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం హితిక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యం కాగా, ఆమె తండ్రి ఫిర్యాదుతో ఈ ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఇంటిపక్కనే బాత్రూమ్‌లో విగతజీవిగా పాప మృతదేహాం లభించగా.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. పలు కోణాల్లో బృందాలుగా పోలీసుల విచారణ చేపట్టి అనుమానంతో పలువురిని ప్రశ్నించారు.
ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా.. అతడికి ఈ హత్యతో సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. అయితే తోటికోడలు పెత్తనం సహించలేకే మమత ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. హత్యలో ఒక్కరే ఉన్నారా..? మరెవరైనా పాలుపంచుకున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆదర్శనగర్‌కు చెందిన సోదరులు ఆకుల రాము, లక్ష్మణ్‌లకు నవీన, మమతతో వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితాక్షి (6) ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. లక్ష్మణ్, మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. నాలుగు నెలల క్రితం మమత ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌క్రైం కేసు నమోదైంది. వారి కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో నవీనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమెపై మమత ద్వేషం పెంచుకున్నట్లు తెలిసింది.
శనివారం ఉదయం వేదాంశ్, హితాక్షిని స్కూల్‌కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉంది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేటు, బాత్‌రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత.. హితాక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసి, కట్టర్‌తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హితాక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని వాటిని వాషింగ్ మెషీన్‌లో వేసి, అందరితోపాటు హితాక్షి కోసం వెతికినట్లు తెలిసింది. హితాక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆస్పత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం.