అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య
హాలియా : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని అనుములవారిగూడెంలో చోటుచేసుకుంది.
హాలియా : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని అనుములవారిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని అనుముల వారిగూడెం గ్రామానికి చెందిన శీలం వెంకటయ్య(55) కొన్ని సంవత్సరాలుగా ఐదు ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు. కాగా ప్రస్తుత ఖరీఫ్‌లో ఐదు ఎకరాలు పత్తి సాగు చేయగా వర్షాభావంతో ఎండిపోయింది. తనకున్న ఎకరం పొలం తన కూతురుకు వరకట్నం కింద ఇచ్చాడు. చేసిన సుమారు రూ.6లక్షల అప్పు తీరే మార్గం లేకపోవడంతో కలత చెంది ఆదివారం వ్యవసాయ పొలంలోనే పురుగుల మందును సేవించాడు. కాగా పొలంలో కొట్టుకుంటుండగా పక్క రైతు వచ్చి బంధువులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్లగొండకు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్‌ఐ వెంకట్ తెలిపారు. మృతునికి భార్య, ఒక్కతే కూతురు ఉన్నారు.