నేటి ఆధునిక సమాజంలోనూ కులబహిష్కరణ సంఘటనలు కలవరపెడుతున్నాయి...
ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
మంచిర్యాల రూరల్: నేటి ఆధునిక సమాజంలోనూ కులబహిష్కరణ సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఓ చిన్న ఘటన ఏకంగా సర్పంచ్ కుటుంబాన్నే కుల బహిష్కరణ చేసే దాకా వెళ్లింది. ఆదిలాబా ద్ జిల్లా మంచిర్యాల మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్గం లక్ష్మికి జరిగిన ఈ చేదు ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇదీ జరిగింది..
రెండేళ్ల క్రితం సర్పంచ్ లక్ష్మికి తోటి కోడలు భాగ్యలక్ష్మితో గొడవ జరిగింది. భాగ్యలక్ష్మి ఇంటి వద్ద ఉన్న అంబేడ్కర్ జెండా గద్దె నిర్మాణమే గొడవకు దారి తీసింది. దీంతో కుల సంఘం భాగ్యలక్ష్మికి రూ.వెయ్యి జరి మానా విధించింది. అరుుతే మరోసారి ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏర్పడిన ఈ వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కుల పెద్దల మాట ధిక్కరించి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినందుకుగాను.. సర్పంచ్ దుర్గం లక్ష్మి రూ.2,500 జరిమానా కట్టాలని తీర్మానం చేశారు. జరిమానా కట్టనని సర్పంచ్ తెలపడంతో ఆమెను కుల బహిష్కరణ చేస్తూ తీర్మానం చేశారు.
ఇది జరిగిన తర్వాత రోజు గ్రామంలోని తమ కులానికి చెం దిన ఓ కుటుంబం సర్పంచ్‌ను వివాహానికి ఆహ్వానించింది. విషయం తెలుసుకున్న కుల సంఘం నేతలు పెళ్లివారితో మాట్లాడారు. పెళ్లికి రావొద్దని సర్పంచ్‌కు సమాచారం ఇప్పించారు. ఒకవేళ వస్తే కుల బహిష్కరణతోపాటు రూ.5 వేల జరి మానా తప్పదని సర్పంచ్ కుటుంబాన్ని కుల పెద్దలు హెచ్చరించారు. దీనిపై సర్పంచ్ లక్ష్మి-శ్రీనివాస్ దంపతులు ఏఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు.
రాజకీయ కుట్రలతోనే బహిష్కరణ
రాజకీయ కక్షతోనే కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ కుల బహిష్కరణకు కుట్ర చేశారు. అభివృద్ధిలో ముందుకు వెళ్లడంతోపాటు రాజకీయంగా నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. నేను అధికార పార్టీ సర్పంచ్‌ను కాకపోవడం కూడా దీనికి కారణం. నా కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారు. నాకు ప్రజాప్రతినిధుల, కుల సంఘం అండదండలు అందలేదు.
- దుర్గం లక్ష్మి, సర్పంచ్, పెద్దంపేట