ప్రాణం మీదికి తెచ్చిన పెద్దనోట్ల రద్దు | Demonetisation killed the person | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదికి తెచ్చిన పెద్దనోట్ల రద్దు

Dec 22 2016 3:51 AM | Updated on Sep 4 2017 11:17 PM

ప్రాణం మీదికి తెచ్చిన పెద్దనోట్ల రద్దు

ప్రాణం మీదికి తెచ్చిన పెద్దనోట్ల రద్దు

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఒక రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. పత్తి విక్రయించగా వచ్చిన డబ్బుల కోసం క్యూలో నిలబడి స్పృహ కోల్పోయి గాయాలపాలై మృతిచెందిన సంఘటన విషాదాన్ని నింపింది.

- క్యూలో నిలబడి స్పృహ తప్పి కింద పడడంతో గాయాలు
ఆస్పత్రికి తరలిస్తుండగా రైతు కొమురయ్య మృతి

సుల్తానాబాద్‌ రూరల్‌: పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఒక రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. పత్తి విక్రయించగా వచ్చిన డబ్బుల కోసం క్యూలో నిలబడి స్పృహ కోల్పోయి గాయాలపాలై మృతిచెందిన సంఘటన విషాదాన్ని నింపింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలోని మంచిరామి గ్రామానికి చెందిన రైతు గోపిరెడ్డి కొమురయ్య(67) పత్తి విక్రయించగా.. రూ. 15 వేలు వచ్చాయి. ఈ డబ్బులకు వ్యాపారి చెక్కు ఇచ్చాడు. దాన్ని నుకుల ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో సోమవారం జమ చేసిన కొమురయ్య రూ.4 వేలు డ్రా చేశాడు. మిగిలిన డబ్బుల కోసం బుధవారం ఉదయం బ్యాంకుకు వెళ్లి  క్యూ కట్టాడు. బారులు తీరి ఉన్న క్రమంలో స్పృహ తప్పి పడి పోయాడు. దీంతో తలకు గాయంకాగా అక్కడున్న వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో మనుమడు అనిల్‌ అతడిని కాట్నపల్లిలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేసే కొమురయ్య కుమారుడు భూమేశ్‌ వద్దకు ఆటోలో తీసుకువెళ్లాడు.

ప్రాథమిక వైద్యం నిర్వహించిన అనంతరం భూమేశ్‌ 108 వాహనం కోసం ప్రయత్నించాడు. అక్కడికి వాహనం రాకపోవ డంతో తన కారులో కరీంనగర్‌ సమీపంలోని చల్మెడ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆస్ప త్రికి చేరేలోగానే కొము రయ్య మరణించాడు. ఆయన మృతదేహాన్ని సుల్తానా బాద్‌లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. రైతు లైన్‌లో నిలబడి కిందపడి గాయాలై మృతి చెందినట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవేందర్‌ తెలిపారు. తలకు గాయం కావడం తో తలలో రక్తం సరఫరా నిలిచి పోయి ప్రాణాలకు ముప్పు వచ్చిందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement