పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు | Cotton sector gets ₹5,659 crore boost 32 lakh farmers to benefit | Sakshi
Sakshi News home page

పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు

May 6 2026 9:23 AM | Updated on May 6 2026 9:23 AM

Cotton sector gets ₹5,659 crore boost 32 lakh farmers to benefit

న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్‌కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోది సారథ్యంలో భేటీ అయిన కేబినెట్‌ 2026–27 నుంచి 2030–31 కాలంలో అమలయ్యే ‘మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ’కింద ఈ మొత్తం వెచి్చంచాలని నిర్ణయించింది. దేశంలో పండే పత్తిలో నాణ్యత తగ్గడంతోపాటు దిగబడి క్రమంగా తగ్గిపోతుండటం వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచి్చస్తారంది. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను అభివృద్ధి పర్చడం, ప్రస్తుతమున్న సాంకేతికతను మరింత విస్తృతం చేయడం ఈ మిషన్‌ లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది. దీనితో దేశంలోని 32 లక్షల మందికి లబ్ధి కలుగనుందని పేర్కొంది.

చెరకు కనీస ధర పెంపు 
అక్టోబర్‌ నుంచి మొదలయ్యే 2026–27 సీజన్‌కుగాను చెరకు కనీస ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్‌ఆర్‌పీ)ని క్వింటాలుకు రూ.10 చొప్పున రూ.365కి పెంచేందుకు మంగళవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. తాజాగా ఆమోదించిన ఎఫ్‌ఆర్‌పీ 2025–26 సీజన్‌ ధర క్వింటాల్‌కు రూ.355 కంటే 2.81 శాతం ఎక్కువని ఆయన వివరించారు. మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతులకు రక్షణగా 10.25 శాతం రికవరీ రేటు ఆధారంగానే క్వింటాలకు ధర రూ.365 ఉంటుందని తెలిపారు. 

ఇది ప్రస్తుత 2025–26 సీజన్‌ ధర రూ.355 కంటే 2.81 శాతం అధికమని చెప్పారు. ఒకవేళ రికవరీ రేటు 10.25 శాతం కంటే ప్రతి 0.1 శాతం పెరిగితే, క్వింటాల్‌కు అదనంగా రూ.3.56 చెల్లిస్తారన్నారు. 9.5 శాతం కంటే తక్కువ రికవరీ ఉన్న మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారికి ఎటువంటి కోత విధించకుండా క్వింటాల్‌కు రూ. 338.30 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. 2026– 27లో చెరకు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.182 చొప్పున ఉంటుందన్న అంచనా ప్రాతిపదికన ఎఫ్‌ఆర్‌పీ100.5 శాతంగా నిర్ణయించామని చెప్పారు. దీనివల్ల రైతులకు అదనంగా రూ.లక్ష కోట్ల మేర లాభం చేకూరనుందని వివరించారు.    

Advertisement
 
Advertisement
Advertisement