మెడికల్‌ టూరిజం హబ్‌గా భారత్‌ | India is advancing as a global healthcare hub | Sakshi
Sakshi News home page

మెడికల్‌ టూరిజం హబ్‌గా భారత్‌

May 3 2026 6:19 AM | Updated on May 3 2026 6:19 AM

India is advancing as a global healthcare hub

ఏటా వైద్యం కోసం 5 లక్షల మంది విదేశీయుల రాక

వీరిలో కార్డియాక్, ఆర్ధోపెడిక్, క్యాన్సర్‌ బాధితులే ఎక్కువ

ఆధునిక వైద్యం చౌకగా అందుతుండటమే కారణమని కేంద్రం వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్‌ ‘గ్లోబల్‌ హీలింగ్‌ డెస్టినేషన్‌’గా మారిందని కేంద్రం తెలిపింది. మెడికల్‌ టూరిజం, వెల్‌నెస్‌ టూరిజం భారత మోడల్‌కు రెండు బలమైన స్తంభాలుగా ఉన్నాయంది. 

యోగా, ఆయుర్వేదం, నేచురోపతి, సిద్ధ, యునాని వంటి సంప్రదాయ వైద్య విధానాలు కలగలిసి భారత్‌ను సమగ్ర ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మార్చాయని తెలిపింది. వైద్య పర్యాటకంలో ప్రధానంగా గుండె శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్‌ చికిత్స, న్యూరో సర్జరీ, ఎముకల చికిత్స, ఫెర్టిలిటీ సేవలు, కాస్మెటిక్‌ సర్జరీ, డెంటల్‌ కేర్‌ వంటి అధునాతన వైద్య సేవల అందుబాటులో ఉన్నాయి. 

అదేసమయంలో, వెల్‌నెస్‌ టూరిజంలో ప్రధానంగా యోగా, ధ్యానం, ఆయుర్వేదం, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి విధానాల్లో నివారణాత్మక, సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందుతోందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్రం వివరించింది. ఈ రెండూ కలిపి భారత్‌ను చికిత్స కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య పునరుద్ధరణ, మానసిక ప్రశాంతత, జీవనశైలి మార్పు కోసం కూడా ప్రత్యేక గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని తెలిపింది.

అంతర్జాతీయంగా భారత్‌కు 10వ స్థానం
మెడికల్‌ టూరిజం ఇండెక్స్‌ ప్రకారం..ప్రపంచంలోని 46 గమ్యస్థానాల్లో భారత్‌ 10వ స్థానంలో ఉంది. ప్రపంచ టాప్‌ 20 వెల్‌నెస్‌ మార్కెట్లలో 12వ స్థానంలో, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోని టాప్‌ –10 వెల్‌నెస్‌ డెస్టినేషన్లలో 5వ స్థానంలో నిలిచింది. 2025–26 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం విదేశీ పర్యాటకుల్లో మెడికల్‌ టూరిజం 5.22 శాతం వాటా కలిగి ఉంది. ఈ రంగం ద్వారా సుమారు 8.46 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించాయి.

 2025లోనే వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చిన విదేశీయులు 5,07,244 మంది కాగా, వీరిలో బంగ్లాదేశ్‌ నుంచి 3,25,127 మంది, ఇరాక్‌ నుంచి 30,989 మంది, ఉజ్బెకిస్తాన్‌ నుంచి 13,699 మంది, సోమాలియా నుంచి 11,506 మంది, తుర్క్‌మెనిస్తాన్‌ నుంచి 10,231, ఒమన్‌ నుంచి 9,738 మంది, కెన్యా వాసులు 9,357 మంది వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ మెడికల్‌ వాల్యూ ట్రావెల్‌ మార్కెట్‌ 2022లో సుమారు 115.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా నమోదవగా, 2030 నాటికి ఇది 286.1 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని, పరిశ్రమ అంచనాల ప్రకారం 2025 నాటికి భారత వైద్య పర్యాటక రంగం విలువ 8.7 బిలియన్‌ డాలర్లకు చేరగా, 2030 నాటికి 16.2 బిలియన్‌ డాలర్ల స్థాయికి ఎదగనుందని వివరించింది. భారత్‌ ఆరోగ్య వ్యవస్థలో ప్రస్తుతం 69,364 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 43,486 ప్రైవేట్, 25,778 ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులు. అదేవిధంగా, దేశంలో 12 లక్షల నమోదిత వైద్యులు ఉన్నారని కేంద్రం తెలిపింది. అమెరికా, యూరప్‌ ఖండాల్లోని దేశాలతో పోలిస్తే భారత్‌లో గుండె, క్యాన్సర్, ఆర్థోపెడిక్, ఫెర్టిలిటీ వంటి చికిత్సలు చాలా తక్కువ ఖర్చుతో అందుతున్నాయి. వేచి ఉండే సమయం కూడా తక్కువ కలిసి భారత్‌ వైపు చూసేందుకు దోహదం చేస్తున్నాయని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement