న్యూఢిల్లీ: పత్తి దిగుమతులకు అయిదు నెలల పాటు అన్ని రకాల కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. దేశీయంగా టెక్స్‌టైల్ పరిశ్రమకు కాటన్ లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని వివరించింది. టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమకు ముడి సరుకు వ్యయాలు తగ్గడానికి, దేశీయ రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే తయారీ సంస్థలు, వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు దోహదపడగలదని తెలిపింది.
టెక్స్‌టైల్ పరిశ్రమ ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశీయ మార్కెట్లో పత్తి లభ్యతపై ఒత్తిడి ఉండటంతో పాటు ముడి సరుకు ధరలు పెరగడం వల్ల స్పిన్నింగ్, గార్మెంట్ తయారీ యూనిట్లు వ్యయభారం ఎదుర్కొంటున్నాయని వారు పేర్కొన్నారు. దిగుమతి సుంకాల మినహాయింపుతో విదేశాల నుంచి తక్కువ ఖర్చుతో పత్తిని దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా టెక్స్‌టైల్ సంస్థలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. అలాగే భారత టెక్స్‌టైల్, అపారెల్ ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడంతో పాటు ఉత్పత్తి చక్రం అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


