చంద్రబాబు ప్రోద్బలంతోనే నాపై విచారణ | CID Questions Bhumana for 2nd Day | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రోద్బలంతోనే నాపై విచారణ

Sep 8 2016 2:27 AM | Updated on Sep 4 2017 12:33 PM

చంద్రబాబు ప్రోద్బలంతోనే నాపై విచారణ

చంద్రబాబు ప్రోద్బలంతోనే నాపై విచారణ

కాపులు చేస్తున్న న్యాయమైనపోరాటంలో బలిపశువును కావడం భగవంతుని ప్రసాదంగా భావిస్తున్నానని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

నన్ను అక్రమంగా జైలుకు పంపే కుట్ర పన్నుతున్నారు: భూమన

సాక్షి, గుంటూరు/పట్నంబజారు: కాపులు చేస్తున్న న్యాయమైనపోరాటంలో బలిపశువును కావడం భగవంతుని ప్రసాదంగా భావిస్తున్నానని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయం ఆవరణలో భూమనను తుని ఘటన కేసులో బుధవారం రెండోరోజున విచారించారు. విచారణకు హాజరయ్యేముందు, విచారణ పూర్తయి బయటికొచ్చిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపుల న్యాయమైన కోర్కెలకోసం తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధపడడానికి మానసికంగా సంసిద్ధుడినై వెళుతున్నానని చెప్పారు.

చంద్రబాబు ఇంటిపేరు వంచన.. కేరాఫ్ అడ్రస్ కుట్ర, ఆయన గోత్రం మోసమని, వీటితో పరిపాలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపట్ల తనకు నమ్మకముందని, ఏనాడూ హింసాయుతమైన చర్యలకు పాల్పడే చరిత్రలేని తనను ఉద్దేశపూర్వకంగా సీఐడీద్వారా పిలిపించే కుట్ర చంద్రబాబు చేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టాలని.. వైఎస్సార్‌సీపీని సర్వనాశనం చేయాలనే తలంపుతో తుని ఘటనలో జరిగిన విధ్వంసానికి తమను పావులుగా వాడే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు. జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారన్నారు. వీరెన్ని కుట్రలు చేసినా వెరవనన్నారు. అమాయకులను కేసుల్లో ఇరికించి వేధించడంలో బాబు దిట్టని, తనను ఎదిరించేవారిని సహించలేని తత్వం ఆయనదని దుయ్యబట్టారు. సీఐడీ అధికారులు హరికృష్ణ, భాస్కర్‌లు తనపట్ల సభ్యతతో వ్యవహరించారని, ఇందుకు వారిని అభినందిస్తున్నానని భూమన చెప్పారు. 

తుని ఘటనపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నిజాలు నిగ్గుతేలుతాయనే మాటకు తామిప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీఐడీ విచారణలో భాగంగా రెండోరోజు బుధవారం కరుణాకర్‌రెడ్డిని సీఐడీ  అధికారులు ఏడున్నర గంటలపాటు విచారించారు.విచారణ పూర్తయి భూమన బయటికొచ్చేవరకూ ఆయన్ను అరెస్టు చేస్తారనే ఆందోళనతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూశారు.  సీఐడీ ఏఎస్పీ హరికృష్ణ మాట్లాడుతూ విచారణ పూర్తయిందని, అవసరమైతే మళ్లీ  పిలుస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement