సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది: టీడీపీ నేత | TDP Leader OV Ramana Sensational Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది: టీడీపీ నేత

May 27 2026 8:53 AM | Updated on May 27 2026 9:02 AM

TDP Leader OV Ramana Sensational Comments On Pawan Kalyan

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నది తమ చిరకాల ఆకాంక్ష అని.. కాపు యువత ఇదే కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజికవర్గం పవన్‌ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదన్నారు.

సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా, జోకర్లుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. రానురాను కాపు జాతికి సిగ్గు, పౌరుషం తగ్గిపోతోందన్నారు. టీడీపీ అంటే కమ్మ, జనసేన అంటే కాపు పార్టీ అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ మాత్రం తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా పవన్‌కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాపు కులం లేకపోతే పవన్‌ కళ్యాణ్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేవారా?. పవన్‌ ఈ రోజు మాత్రం రాణించగలిగే వాడా అంటూ ప్రశ్నించారు. కాపు కులం గురించి పవన్‌ తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని అన్నారు. పవన్‌కు ఆ ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యమన్నారు.

కాపులను దూరం పెట్టే పనిలో పవన్‌..
గత ఎన్నికల్లో కాపు జాతి పవన్‌ కళ్యాణ్‌ను సొంతం చేసుకుందని... కానీ పవన్‌ కళ్యాణ్‌ కాపులను దూరం పెట్టే పనిలో ఉన్నారని ఓవీ రమణ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కూడా కేటాయించని ప్రభుత్వంలో కాపు నేతగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు  ప్రశ్నించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు, ఎస్సీ, ఎస్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారని, పవన్‌ ఇలాగే ఉంటే రాష్ట్రంలో కొత్త నాయకుడు పుట్టుకొస్తాడన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ వారికి గుర్తింపు లేదన్నారు. తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని విజయ్‌ ఎదిగారని గుర్తు చేశారు. మరి పవన్‌ ఎందుకు ఎదగకూడదని, ఆ దిశగా పవన్‌ ఆలోచించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement