విజృంభిస్తున్న విషజ్వరాలు | Booming toxins | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న విషజ్వరాలు

Sep 12 2017 10:34 PM | Updated on Aug 30 2018 6:04 PM

విజృంభిస్తున్న విషజ్వరాలు - Sakshi

విజృంభిస్తున్న విషజ్వరాలు

గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.

- గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యం
- పట్టించుకోని అధికారులు, పంచాయతీ సిబ్బంది
- జ్వరాలతో అల్లాడుతున్న గ్రామీణులు
- మందు బిళ్లలతో సరిపెడుతున్న వైద్యసిబ్బంది
- ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్న రోగులు
 
ఎమ్మిగనూరు రూరల్‌: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరీముఖ్యంగా విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యధిక శాతం గ్రామాల్లో మురుగు కాలువలు లేవు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బురద, మురుగునీరు ఇళ్ల ముందుకు చేరుతోంది. వాటిని దోమలు ఆవాసంగా చేసుకుంటున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు దోమల మోత మోగుతోంది. వాటి కాటు వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలతో గ్రామాలకు గ్రామాలే తల్లడిల్లుతున్నా అధికారులకు మాత్రం ఏమీ పట్టడంలేదు. తూతూమంత్రంగా గ్రామాలను సందర్శిస్తూ తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. 
 
ఎమ్మిగనూరు మండల పరిధిలోని వెంకటగిరి, మసీదపురం, కందనాతి, సోగనూరు, ఎర్రకోట, కడిమెట్ల, ఏనుగుబాల, కడివెళ్లతో పాటు పలు గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. వెంకటగిరిలో 100 మంది, ఎర్రకోటలో 100 మంది, మసీదపురంలో 60, మిగిలిన గ్రామాల్లో 10నుంచి 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామాలకు ప్రభుత్వ వైద్య సిబ్బంది సరిగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా మందు బిళ్లలతో సరిపెడుతున్నారు. దీంతో జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ప్రైవేటు వైద్యులు, ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.
 
ఒక్కోసారి ఆర్‌ఎంపీలను పిలిపించుకొని ఇంటి దగ్గరే సెలైన్‌ బాటిల్స్‌ పెట్టించుకుంటున్నారు. ఎమ్మిగనూరులో 50 పడకల ఆస్పత్రి, హాలహార్విలో పీహెచ్‌సీ ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఎర్రకోటలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జ్వరాల ప్రభావం ఉన్న కాలనీలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి..జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. అయినా ఇంతవరకు అతీగతీ లేదు. 
 
లోపిస్తున్న పారిశుద్ధ్యం
గ్రామాల్లో జ్వరాలు ప్రబలటానికి పారిశుద్ధ్య లోపమేనని పలువురు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల్లో వీధులు మురికికూపాలను తలపిస్తున్నాయి. ఇళ్ల ముందే అపరిశుభ్రత నెలకొని దుర్గంధం వెదజల్లుతోంది. ఎస్‌.నాగలాపురం, మసీదపురం, వెంకటగిరి, పెసలదిన్నె, దేవబెట్ట, దైవందిన్నె, ఏనుగుబాల, సోగనూరు గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పారిశుద్ధ్యం మెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
 
 
మంచం పట్టిన పెద్దకడబూరు
– దాదాపు 200 మందికి జ్వరాలు
 
పెద్దకడబూరు: విష జ‍్వరాలతో మండల కేంద్రం మంచం పట్టింది. వారం క్రితం కురిసిన వర్షాలకు మురుగునీరు రోడ్లపై నిలిచి పరిసరాలు కలుషితమయా‍్యయి. ఇక దోమలు కూడా వృద్ధి చెంది వ్యాధులకు కారణమయ్యాయి. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలలో దాదాపు 200మందికి పైగా రోగాల భారిన పడ్డారు. ఆర్థిక స్థోమత లేక స్థానిక ఆర్‌ఎంపీలతోనే చికిత్సలు పొందుతున్నారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వీడి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement