అపోహ నుంచి ఆరోగ్యం దాకా
అమెరికాలో చిన్నారుల్లో పల్లీలు తింటే అలర్జీ అని గతంలో అపోహ
2015లో ఓ పరిశోధన తర్వాత మారిన అభిప్రాయాలు
అప్పటి నుంచి పిల్లలకు పల్లీల ఆహారం ఇవ్వాలని ప్రభుత్వం సూచన
తాజా అధ్యయనంలో పల్లీలు తినటం మంచివేనని వెల్లడి
4–6 నెలల నుంచే పల్లీల ఆహారం ఇవ్వొచ్చని వైద్యుల సూచన..
మనదేశంలో శిశువులకు అలర్జీలు తక్కువేనంటున్న వైద్యులు
సాక్షి, సాగుబడి: ఆహార పదార్థాలన్నీ అందరికీ సరిపడాలన్న నియమం ఏమీ లేదు. అలర్జీకి కారణమయ్యే అవకాశం ఉన్న వేరుశనగల్లాంటి ఆహార పదార్థాలను పసిపిల్లలకు ఎంత వయసులో అలవాటు చెయ్యటం ప్రారంభించాలి? ఈ ప్రశ్నకు సమాధానం దేశాన్ని బట్టి మారిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. విదేశాల్లోని పిల్లలతో పోలి్చతే మన పిల్లలకు ఇమ్యునిటీ ఎక్కువేనని, వారికి వచి్చన అలర్జీలన్నీ మనకు రావాలనేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 3.3 కోట్ల మందికి ఆహార సంబంధమైన అలర్జీలున్నాయని అంచనా.
అక్కడి పిల్లలకు వేరుశనగలు (పల్లీలు), గుడ్లు, సోయాచిక్కుళ్లు తింటే అలర్జీ వస్తాయనే అభిప్రాయం ఉండేది. అందుకే మూడేళ్లు నిండే వరకు పిల్లలకు పల్లీలు పెట్టొద్దని అమెరికా ప్రభుత్వం గతంలో అనేక దశాబ్దాల పాటు అక్కడి తల్లిదండ్రులు, వైద్యులకు చెప్పింది. అయితే, ఆ తర్వాత కాలంలో జరిగిన వైద్య పరిశోధనల ఫలితాలను బట్టి 4–6 నెలల వయసులోనే శిశువులకు వేరుశనగలు తినిపించటం మొదలు పెట్టాలని సూచించింది. దీని వల్ల అలర్జీ బెడద చాలా వరకు తగ్గిందని తాజా అధ్యయనం చెబుతోంది.
మన పరిస్థితి ఏమిటి?
మన దేశంలో 6 నెలలు నిండిన పసి పిల్లలకు ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు కొద్ది మోతాదులో తినిపించవచ్చని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) ఆహార మార్గదర్శకాల్లో
సూచించింది.
లండన్ అధ్యయనంతో మార్పు
2015లో లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జిడియోన్ లాక్ జరిపిన లెర్నింగ్ ఎర్లీ అబౌట్ పీనట్ ఎలర్జీ (ఎల్‌ఈఏపీ) అధ్యయనం వేరుశనగల అలర్జీపై అమెరికాకున్న పూర్వపు అవగాహనను పూర్తిగా మార్చేసింది. పుట్టిన కొద్ది నెలలకే శిశువులకు వేరుశనగలను తినిపించటం అలవాటు చేస్తే మున్ముందు జీవితంలో ఫుడ్ అలర్జీల ముప్పు 80% వరకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం తేలి్చంది. ఈ పిల్లలు కౌమార దశ వరకూ 70% మందికి ఫుడ్ అలర్జీల బెడద లేదని కూడా తేలింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ఫలితాల ఆధారంగా 2015లో అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 4–6 నెలల మధ్య వయసులో శిశువులకు వేరుశనగ గింజలను తినిపించటం అలవాటు చెయ్యవచ్చని స్పష్టం చేసింది.
నాలుగు నెలల నుంచే పెట్టొచ్చు..
గత దశాబ్ద కాలంగా 4–6 నెలల శిశువులకు వేరుశనగలు అలవాటు చెయ్యటం వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయని తాజా అధ్యయనం తేలి్చంది. ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో అలర్జీ నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ హిల్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన వివరాలు ఇటీవల మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 2015లో సవరించిన మార్గదర్శకాల వల్ల సుమారు 60 వేల మంది పిల్లలు వేరుశనగల అలర్జీ నుంచి తప్పించుకున్నారని వెల్లడైంది. ఇది చాలా గొప్ప సంగతి కదూ అన్నారు డా. డేవిడ్ హిల్.
డజన్ల కొద్దీ పిల్లల వైద్యుల వద్ద నుంచి 2015కు ముందు, ఆ తర్వాత పిల్లలకు అందించిన అలర్జీ చికిత్సల వివరాలను సేకరించి ఆయన విశ్లేíÙంచారు. మూడేళ్ల లోపు పిల్లల్లో వేరుశనగల అలర్జీ కేసులు 2015 తర్వాత 27%, 2017 తర్వాత 40% తగ్గిపోయాయని నిర్ధారించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్ 2021లో మార్గదర్శకాలను మరోసారి సవరించి ఎటువంటి ముందస్తు పరీక్షలు చెయ్యకుండానే 4 నుంచి 6 నెలల శిశువులకు వేరుశనగ గింజలు, గుడ్లు, సోయాచిక్కుళ్లు వంటి అలర్జీ వచ్చే అవకాశం ఉన్న ఆహారాలను అలవాటు చెయ్యమని సూచించింది. అయితే, ఏడు నెలలకన్నా ముందు శిశువులకు వేరుశనగలు తినిపిస్తున్న తల్లిదండ్రులు ఇప్పటికీ కేవలం 17% మాత్రమేనని ఒక సర్వే చెబుతోంది.
వేరుశనగతో అలర్జీ ఎందుకొస్తుంది?
వేరుశనగ గింజల్లోని ప్రొటీన్లు హాని చేస్తాయేమోనని పిల్లల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా అర్ధంచేసుకొని రక్షణాత్మకంగా ప్రత్యేక రసాయనాలను విడుదల చేయటం ద్వారా ఈ గింజలు తినగానే అలర్జీ రియాక్షన్ వస్తోందని పరిశోధకులు గుర్తించారు. శరీరంపై దద్దుర్లు రావటం, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ అలర్జీ అతి తీవ్ర రూపం దాల్చి ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు.
మన పిల్లల్లో ఇమ్యునిటీ ఎక్కువ
వాతావరణం, జీవనశైలిలో అమెరికాకు మనకు వ్యత్యాసం ఉంది. వారితో పోలి్చతే మన పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువ. కాబట్టి వారికి వచ్చే కొన్ని అలర్జీలు మన పిల్లలకు అంతగా రావు. శిశువుకు 6 నెలల వరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలల తర్వాతే ధాన్యాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను మెత్తగా వండి కొద్దికొద్దిగా తినిపించటం ప్రారంభించాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సూచిస్తోంది. సాధారణంగా మన దగ్గర మరీ చిన్న పిల్లలకు వేరుశనగలు పెట్టరు. బిడ్డకు సంవత్సరం నిండే వరకు తల్లి పాలు ఇవ్వటం కొనసాగిస్తూనే అనుబంధ ఆహారం అలవాటు చెయ్యటం మంచిది. పసిపిల్లలకు జలుబుల్లాంటివి వచి్చనా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉంటే వాటికవే తగ్గుతాయి. ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది. – డాక్టర్ వి.ఆర్. లోహిత్ కుమార్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, అమీర్‌పేట.


