పెసర సాగు లాభదాయకం | agriculture story of anantapur | Sakshi
Sakshi News home page

పెసర సాగు లాభదాయకం

Jun 15 2017 11:56 PM | Updated on Jun 4 2019 5:04 PM

పెసర సాగు లాభదాయకం - Sakshi

పెసర సాగు లాభదాయకం

ఖరీఫ్‌లో వర్షాధారంగా పెసర పంట లాభదాయకంగా ఉంటుందని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప తెలిపారు.

– పల్లాకు తెగులు నివారణపై దృష్టి పెట్టాలి
– కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌


అనంతపురం అగ్రికల్చర్‌ : ఖరీఫ్‌లో వర్షాధారంగా పెసర పంట లాభదాయకంగా ఉంటుందని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప తెలిపారు. తక్కువ వర్షపాతం నమోదైనా పెసర పండుతుందన్నారు. ప్రమాదకరమైన పల్లాకు తెగులు నివారణకు జాగ్రత్తలు తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. నీటి వసతి కింద సాగుచేస్తే ఎకరాకు 12-14 క్వింటాళ్లు, వర్షాధారం అయితే 6-7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.5,300 నుంచి రూ.6,000 వరకు ధర పలుకుతోందని వారు తెలిపారు.

పెసర పంట యాజమాన్యం
అన్ని రకాల నేలల్లో పెసర పంట వేసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే 20 రోజుల వరకు రసంపీల్చు పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎంజీజీ 295 (మధిర 295), డబ్లు్యజీజీ 460, ఎల్‌జీజీ 460, ఎల్‌జీజీ 450 లాంటి స్వల్పకాలిక రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవచ్చు. సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరంలో విత్తాలి. విత్తే ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోలు భాస్వరం ఎరువులు వేయాలి. కలుపు నివారణకు ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు పెండీమిథాలిన్‌ లేదా ఒక లీటర్‌ 50 శాతం అలాక్లోర్‌ మందులు విత్తిన రోజు లేదంటే మరుసటి రోజు పిచికారి చేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేసుకుంటే కలుపు సమస్యను నివారించుకోవచ్చు.  వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు అవకాశం ఉంటే ఒకట్రెండు నీటి తడులు ఇచ్చుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. పెసరను ప్రత్తి, కందిలో 3:1, 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు.

పల్లాకు తెగులు: ఇది వైరస్‌జాతి తెగులు. తెల్లదోమ ద్వారా వ్యాపించి లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. తొలి దశలో ఆశిస్తే మొక్కలు గిడసబారిపోతాయి. పల్లాకు తెగులును తట్టుకునే డబ్ల్యూజీజీ–42, ఎంజీజీ–295, ఎల్‌జీజీ–407, ఎంఎల్‌జీ–267, పీడీఎం–54, ఎల్‌జీజీ–460 లాంటి విత్తన రకాలు ఎంపిక చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 5 గ్రాముల థయోమిథాక్సిమ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరు చుట్టూ నాలుగు వరుసలు జొన్న, మొక్కజొన్న విత్తుకోవాలి. దీని వల్ల తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంకను నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద, పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. తెగులు సోకిన మొక్కలు పీకేసి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడా పసుపురంగు పూసిన అట్టలకు గ్రీజు పూసి ఉంచితే తెల్లదోమను అదుపులో పెట్టవచ్చు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 10 లీటర్లు వేపగింజల కషాయాన్ని పిచికారి చేసుకోవాలి. లేదంటే 5 మి.లీ వేపనూనె లేదా 1 గ్రాము అసిఫేట్‌ లేదా 1.5 మి.లీ ట్రైజోఫాస్‌ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్‌ లేదా 0.2 గ్రాములు అసిటామిప్రైడ్‌ లేదా 0.2 గ్రాములు థయోమిథాక్సామ్‌ లీటర్‌ నీటికి కలిపి మందులు మార్చి మార్చి పిచికారి చేసుకుంటే పల్లాకు తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement