ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని.. ఆత్మహత్యాయత్నం  | Young Lady Attempt Suicide At Banjarahills Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని.. ఆత్మహత్యాయత్నం 

Feb 9 2020 3:42 AM | Updated on Feb 9 2020 12:45 PM

Young Lady Attempt Suicide At Banjarahills Hyderabad - Sakshi

స్వప్న, వీరబాబు (ఫైల్‌)

బంజారాహిల్స్‌: ప్రేమించిన యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ యువతి పోలీసుల ఎదుటే గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన వీరబాబు(20) జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో అద్దెకుంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బీహెచ్‌ఈఎల్‌ లింగంపల్లిలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న స్వప్న(20)తో 5 నెలల క్రితం టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వీరబాబు తరచూ స్వప్నను తన గదికి పిలిపించుకునేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

రెండు వారాల క్రితం పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది. అందుకు వీరబాబు నిరాకరించాడు. దీంతో స్వప్న జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించినా వీరబాబు మొండికేశాడు. ఈ క్రమంలో స్వప్న శనివారం తన తల్లితో కలిసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వీరబాబుపై చర్యలు తీసుకోవాలని కోరగా పోలీసులు అతడిని పిలిపించారు. అతని వైఖరిలో మార్పులేకపోడంతో ఆగ్రహించిన బాధితురాలు తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. కాగా, ఆమె తన ప్రియుడి తీరుపై ఓ సెల్ఫీ వీడియోను కూడా తీసి తనను అర్థంచేసుకోవాలని కోరింది. పోలీసులు వీరబాబును అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement