బిడ్డ భవిష్యత్‌ ఏమౌతుందోనని.. 

What is the future of the baby..? - Sakshi

అంగవైకల్యంగల కుమార్తెను చెరువులో తోసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు

10రోజుల క్రితమే భార్య  చెల్లెలితో వివాహం

తన కుమార్తెకు అంగవైకల్యం.. కట్టుకున్న రెండో భార్యకు సరిగాలేని మానసిక స్థితి.. అయితే భవిష్యత్‌లో తన కుమార్తె పరిస్థితి కూడా తన రెండోభార్యలాగే ఉంటుందేమోనని మనస్థాపం చెందాడో తండ్రి.. రానున్నరోజుల్లో తన బిడ్డ ఆ కష్టం పడకుండా ఉండాలని భావించాడు.. అలా అనుకుని కన్నకూతుర్ని చెరువులో తోసేశాడు.. తన బిడ్డ పోయాక తానుమాత్రం ఎందుకు బతికుండాలని అనుకున్నాడేమో.. తనుకుడా చెరువులో దూకి ప్రాణాలు విడిచాడు..

నాగిరెడ్డిపేట: అంగవైకల్యంతో పుట్టిన కూతురి భవిష్యత్‌ను ఊహించలేక మనస్థాపానికి గరైన ఓ తండ్రి తన కుమార్తెను చెరువులో ముంచి, తానుకూడా అదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్కంపల్లిలో జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. అక్కంపల్లికి చెందిన ఎరుకుల లోకయ్య(32) తన పెద్ద కూతురు కీర్తన(10)తో కలిసి ఆదివారం రాత్రి గ్రామశివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోకయ్యకు 12ఏళ్ల క్రితం లక్ష్మి అనే మహిళతో వివాహం అయ్యింది.

వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు కీర్తన అంగవైకల్యంతో పుట్టింది. కాగా లోకయ్య భార్య చెల్లెలు గంగమణికి మానసికస్థితి సరిగ్గా లేదు. దీంతో ఈనెల 7వ తేదీన మొదటి భార్య లక్ష్మి తన చెల్లెల్ని లోకయ్యకు ఇచ్చి వివాహం జరిపించింది. ఈ క్రమంలో కూతురు కీర్తనను తీసుకొని గోపాల్‌పేటలోని జాతరకు బయల్దేరుతున్నానని ఇంట్లోనుంచి ఆదివారం బయటకు వెళ్లిన లోకయ్య రాత్రయినా ఇంటికి చేరుకోలేదు. సోమవారం ఉదయం బహిర్భూమి కోసం గ్రామశివారుకు వెళ్లిన గ్రామస్తులు చెరువులో తేలిన తండ్రి,కుమార్తె మృతదేహాలను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.

దీంతో నాగిరెడ్డిపేట ఎస్సై శేఖర్‌ గ్రామానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీయించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్‌ ఘటనా స్థలానికి చేరుకొని తండ్రి, కూతురి మృతదేహాలను పరిశీలించారు. కాగా అంగవైకల్యం కలిగిన తన కూతురి భవిష్యత్‌ కూడా తన రెండో భార్యలాగే ఉంటుందేమోనని లోకయ్య ఆందోళనకు గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top