ఐఎంఎస్‌ కేసులో మరో ఇద్దరి అరెస్టు

Two More Arrested In IMS Scam - Sakshi

ఓమ్ని ఎండీ శ్రీహరి, హోమోక్యూ ఉద్యోగి వెంకటేశ్‌ అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ఓమ్ని ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ, హోమోక్యూ కంపెనీ రీజనల్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ అరెస్టయ్యారు. 2017–18లో ఐఎంఎస్‌కు ఎలాంటి టెండర్లు లేకుండా, కింది స్థాయి డిస్పెన్సరీల నుంచి ఎలాంటి అవసరం లేకున్నా శ్రీహరి బాబు తెల్ల రక్తకణాల క్యూవెట్, గ్లూకోజు క్యూవెట్ల కొనుగోలుకు పథకం వేశాడు. ఇందుకు లెజెండ్‌ అనే డొల్ల కంపెనీని సృష్టించాడు. స్వీడన్‌కు చెందిన హోమో క్యూ అనే కంపెనీ తన డిస్ట్రిబ్యూటర్లకు మార్కెట్‌ రేటుకు తెల్ల రక్తకణాల క్యూవెట్‌ ఒక్కోటి రూ.11,800, గ్లూకోజు క్యూవెట్లను రూ.1,950లకు విక్రయించేది. హోమో క్యూ డిస్ట్రిబ్యూటర్లు ఆస్పత్రులకు రూ.19,200, రూ.2,250 లకు సప్లై చేసేవారు.

ఈ విషయంలో మార్కెట్‌ రేటుకే క్యూవెట్లను కొన్న లెజెండ్‌ కంపెనీ ఐఎంఎస్‌కు తెల్లరక్త కణాల క్యూవెట్‌ను రూ.36,900కి, గ్లూకోజ్‌ క్యూవెట్‌ను రూ.6,200కి విక్రయించేవారు. అప్పటి ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జేడీ పద్మలకు.. శ్రీహరి ముందే ముడుపులు ఇవ్వడంతో వారు లెజెండ్‌ కంపెనీ కోట్‌ చేసిన ధరను ఆమోదిస్తూ బిల్లులు చెల్లించారు. మొత్తమ్మీద రూ.12,84,96,600 అధికంగా చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీహరి బాబు సరఫరా చేసిన మెడికల్‌ కిట్ల ధరను 400 శాతం అధికంగా కోట్‌ చేసి రూ.130 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డా డని ఏసీబీ తేల్చింది. నిందితులిద్దరిపై 420, 120బీ తదితర సెక్షన్లపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరికి రిమాండ్‌ విధించింది. లెజెండ్‌ కంపెనీ యజమాని కృపాసాగర్‌రెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top