భరించలేక.. బరితెగింపు! | TDP Local Leaders Fire To Palm Trees In reserve Forest At Srikakulam | Sakshi
Sakshi News home page

భరించలేక.. బరితెగింపు!

Aug 22 2019 8:05 AM | Updated on Aug 22 2019 8:05 AM

TDP Local Leaders Fire To Palm Trees In reserve Forest At Srikakulam - Sakshi

దహనమవుతున్న తాటిచెట్లు 

సాక్షి, శ్రీకాకుళం : ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా తయారైంది స్థానిక టీడీపీ నాయకుల తీరు. గత 5 ఏళ్లలో ఆ పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీలు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఘోర పరాభవం చెందిన విషయం తెలిసిందే. అయితే... ఆ తప్పిదం తమకు ఓట్లేయని ప్రజలదే అనే ధోరణి వారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం.. టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీ లోకి వెళ్లి పోయేందుకు సిద్ధంగా ఉన్న వారిని నిలబెట్టుకునేందుకు తప్పడు మార్గాలు వెతుకుతున్నారు. గ్రామం అంతా వైఎస్సార్‌ సీపీ వైపే ఉందని తమవైపు మొగ్గు చూపడం లేదని గ్రహించిన ఓ నాయకుడు గ్రామంలోని కొంతమందిని తమవైపుకు తిప్పుకునేందుకు పక్కా హ్యూహం రచించాడు.

తమ గ్రామం పరిధిలోని రిజర్వు ఫారెస్ట్‌కు సంబంధించి కొన్ని తాటిచెట్లకు నిప్పంటించి, అనంతరం అందులో సరుగుడు, జీడిమామిడి చెట్లను వారికి బహుమానంగా ఇవ్వాలనే దురుద్దేశంతో ఏకంగా అడవికే నిప్పంటించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కుందువానిపేట పరిధి సముద్రతీర ప్రాంతం మధ్య సుమారు 350 ఎకరాల రిజర్వు ఫారెస్ట్‌ భూముల్లో తాటిచెట్లు(మడ అడవులు) విస్తరించి ఉన్నాయి. వీటిని అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ సూరాడ అప్పన్న, ఆయన అనుచరులు కలిసి తాటిచెట్లను నరకడమే కాకుండా వాటికి నిప్పు పెడుతూ భీభత్సం సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని అడ్డుకున్న గ్రామస్తులు, వైఎస్సార్‌ సీపీకి చెందిన నాయకులు ప్రశ్నించగా వారిపై దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.

ఆదిలోనే నియంత్రించాల్సింది!
తరతరాలుగా కుందువానిపేట మత్స్యకారులంతా గ్రామానికి సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ను కాపాడుకుంటున్నారు. సహజ సిద్ధంగా ఉన్న ఈ మడ అడవులు ప్రకృతి విపత్తుల నుంచి గ్రామాన్ని కాపాడుతున్నాయి. అలాగే కొంతమంది స్థానికంగా ఉన్న జీడితోటలు నుంచి వచ్చే ఫలాసాయాన్ని కూడా పొందుతున్నారు. అయితే అర్ధాంతరంగా వాటికి నిప్పు పెట్టడంతో గ్రామంలో చాలామందికి జీవనోపాధి కుడా లేకుండా పోతుంది. ఇదే విషయంపై గత వారంలో కలెక్టర్‌ స్పందన కార్యక్రంలో కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంతో టీడీపీ నాయకులు తమ అనుచరులతో ఏకంగా రిజర్వ్‌ ఫారెస్ట్‌కు నిప్పంటించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులంతా భయాందోళన చెందుతున్నారు. అధికారులు ఇటువంటి వాటిపై దృష్టి సారించి ఆదిలోనే వీటిని నియంత్రిచక పోతే మరింత పెచ్చుమీరే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓటమిని భరించలేకే..
టీడీపీకి చెందిన సూరాడ అప్పన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని భరించలేక గ్రామస్తులందరినీ తమవైపు తిప్పుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో సరుగుడు మొక్కలు, జీడితోటలు నాటి, కొంతమందిని కాపాలా పెట్టడం ద్వారా ఆ స్థలాన్ని వారికి ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఏన్నో ఏళ్లుగా గ్రామానికి రక్షణగా ఉన్న తాటిచెట్లకు నిప్పు పెట్టడం చూస్తే.. భవిష్యత్‌లో మరెంత బరి తెగిస్తారో అనిపిస్తుంది. దీనిపై అధికారులు దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– చీకటి దానయ్య, కుందువానిపేట

విపత్తుల నుంచి రక్షణగా
రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని తాటిచెట్లు దశాబ్దాలుగా గ్రామానికి ఎంతో రక్షణగా ఉన్నాయి. తుఫాన్లు, ప్రకృతి విపత్తుల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాయి. ఈ తాటిచెట్లను అనుసరించి ఉన్న మా గ్రామం అంతా వాటి వెనుకే తలదాచుకుంటుంది. తాటిచెట్లను పూర్తిగా ధ్వంసం చేస్తే.. గ్రామం అంతా సముద్ర కోతకు గురైపోతుంది. ఇటువంటి చర్యలకు ఆది లోనే అడ్డుకట్ట వేయాలి.
– ఆర్‌.మల్లేష్, కుందువానిపేట

చర్యలు తీసుకుంటాం..
విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని కుందువానిపేటకు పంపించాం. ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అలాగే రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిరక్షణపై నిఘా పెంచడంతో పాటు కొత్త మొక్కలు నాటే అవకాశాలను పరిశీలిస్తాం.
– గోపాలనాయుడు, అటవీశాఖ అధికారి, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement