టీడీపీ నేతల దాష్టీకం

TDP Leaders Attack on Army Employee in Visakhapatnam - Sakshi

ఆర్మీ ఉద్యోగిపై రెండుసార్లు దాడులు

ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు

రక్షణ కల్పించాలని బాధితుడి వేడుకోలు

కేసు విచారణకు అధికార పార్టీ ప్రజాప్రతినిధి మోకాలడ్డు

అనకాపల్లిలో అదుపుతప్పుతున్న శాంతిభద్రతలు

విశాఖపట్నం: అనకాపల్లిలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయి. అధికార పార్టీ నేతల బరితెగింపు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా  అశాంతి రాజ్యమేలుతోంది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో  ఓ ఆర్మీ ఉద్యోగిపై   రెండో సారి కూడా దాడి జరిగింది. ఆ దాడి చేసింది   టీడీపీ నేత అనుచరులని, అందువల్లే ఫిర్యాదుచేసినా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  వివరాలు ఇలా ఉన్నాయి

అనకాపల్లి పట్టణంలోని కోట్నివీధికి చెందిన శ్యామలరావు అనే వ్యక్తి ఆర్మీలో పని చేస్తున్నాడు. ఈయనపై గతంలో ఒకసారి తాకాశివీధి వద్ద దాడి జరిగింది. పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులకు, శ్యామలరావుకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వారు దాడి చేశారు.  కేసు నమోదు అయినా  విచారణ తూతూ మంత్రంగా  సాగుతోంది. దీంతో బాధితుడి    కుటుంబ సభ్యులు కమాండర్‌ అధికారి ద్వారా  కలెక్టర్‌కు, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ కేసు విచారణలో పురోగతి లేకుండాపోయింది. టీడీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్ల వల్లే ఈకేసు ముందుకు సాగడంలేదని ఆరోపణలు ఉన్నాయి.

మళ్లీ దాడి...
తాజాగా శ్యాలమరావుపై పట్టణానికి చెందిన ఐదుగురు ఈనెల 18వ తేదీ రాత్రి దాడి చేశారు.  దుస్తులు చింపి, తీవ్రంగా కొట్టడంతో శ్యామలరావు రక్తంమడుగులో పడిపోయాడు. దీంతో దాడి ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో తాజాగా ఈ దాడి జరిగిందని  భావిస్తున్నారు.   శ్యామలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన శేఖర్, నర్సింగరావు, కృష్ణాజీ, ప్రసాద్, చిన్నలపై కేసు నమోదు  చేసినట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. 19న నమోదైన ఈ  కేసు విచారణ  నత్తనడకన సాగుతోంది. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడి వల్లే కేసు విచారణలో పురోగతి లేకుండాపోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారు శ్యామలరావును హత్య చేస్తారేమోనని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.   పోలీసులు తనకు న్యాయం చేయాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని శ్యామలరావు వేడుకుంటున్నాడు.   కేసు విచారణను తాను ఉద్యోగం చేసే ప్రాంతానికి బదిలీ చేయాలని కోరుతున్నాడు.

ఈ  ఘర్షణలకు సంబంధించి పెద్దల మధ్య చర్చలు గత నాలుగైదు నెలల నుంచి నడుస్తున్నాయి.  పోలీసుయంత్రాంగం తక్షణమే స్పందించి  బాధితునికి న్యాయం చేయడంతోపాటు పట్టణంలో  శాంతియుత వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top