బాధిత బాలికకు అనస్తీషియా ఇంజెక్షన్లు

Tamil Nadu Gang Rape Case Anesthesia Drug Use On Minor Girl - Sakshi

పోలీసు విచారణలో  వెలుగులోకి

పోలీసులు అదుపులో ముగ్గురు ఫార్మసీ యజమానులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఐనవరం బాలికపై లైంగిక దాడులకు సంబంధించి క్రమేణా అనేక ఘోరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలికపై మొదటిగా లైంగిక దాడికి పాల్పడిన రవికుమార్‌ (66).. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వాడే అనస్తీషియా (మత్తు ఇంజెక్షన్‌)ను ప్రయోగించినట్లు అంగీకరించాడు. దీంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మత్తు ఇంజెక్షన్, మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన ఫార్మసీ దుకాణ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారిస్తున్నారు.

ఐనవరం, పెరంబూరు ప్రాంతాల్లోని మూడు ఫార్మసీల నుంచి వాటిని కొనుగోలు చేసినట్లు నిందితులు ఇచ్చిన సమాచారంతో వారిని పట్టుకున్నారు. రెగ్యులర్‌ ఖాతాదారులు కావడంతో అలవాటుగా ఇచ్చేశామని, వాటిని లైంగికదాడికి వినియోగిస్తారని తాము అనుకోలేదని ఫార్మసీ యజమానులు పోలీసుల వద్ద వాపోయినట్లు సమాచారం.

శస్త్రచికిత్స సమయంలో రోగికి ఇచ్చే అనస్తీషియా ఇంజెక్షన్‌ను నిందితుడు రవికుమార్‌ కొనుగోలు చేసినట్లు తేలింది. నిందితులు పొడిచిన ఇంజెక్షన్ల వల్లనే బాలిక శరీరమంతా దద్దుర్లు ఏర్పడినట్లు తెలుసుకున్నారు. తగిన అర్హతకలిగిన వైద్యుడు జారీచేసిన ప్రిస్కిప్షన్‌ లేకుండా ప్రమాదకరమైన వస్తువులను అమ్మిన నేరానికి వారి లైసెన్సులు రద్దుచేసే అవకాశం ఉంది. బాధిత బాలికకు వైద్యపరీక్షల నిమిత్తం ఆరుగురితో కూడిన వైద్యుల బృందం ఏర్పాటైంది. మానసిక చికిత్స నిపుణుడు, కౌన్సెలింగ్‌ నిపుణుడు, బాలల వైద్య నిపుణుడు తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

కుటుంబ సభ్యులే సెక్యూరిటీ గార్డులు
చెన్నై ఐనవరంలోని బాలికపై లైంగికదాడి సంఘటనతో ప్రయివేటు సెక్యూరిటీ గార్డులపైనే ప్రజల్లో నమ్మకం పోయింది. దీంతో సదరు అపార్టుమెంటు అసోసియేషన్‌ వారు 300  మంది కుటుంబాలతో గురువారం సమావేశమయ్యారు. తమ అపార్టుమెంటును తామే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. చురుకుగా ఉండే పదిమంది ఆడవారికి తాత్కాలికంగా సెక్యూరిటీ బాధ్యతలను అప్పగించారు. నమ్మకమైన సెక్యూరీటీ గార్డుల సంస్థ దొరికేవరకు ఈ మహిళలతోపాటు కొందరు మగవారు కూడా అపార్టుమెంటు రక్షణ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు. మూడు షిఫ్టుల్లో  వారంతా పనిచేసేలా నిర్ణయించారు. వచ్చిపోయే వారిపై పలు ఆంక్షలు విధించారు.  అనుమతిలేనిదే ఎవరినీ లోనికి పంపడం లేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top