చెన్నైలో మృగాళ్లు

17 Arrested For Sexually Assaulting 13 Year Old Girl In Chennai - Sakshi

డ్రగ్స్‌ ఇచ్చి దివ్యాంగ బాలికపై 7 నెలలుగా అత్యాచారం

17 మందిని అరెస్టు చేసిన పోలీసులు

నిందితులపై కోర్టు ప్రాంగణంలోనే లాయర్ల దాడి  

చెన్నై: వినికిడి లోపం ఉన్న 11 ఏళ్ల బాలికకు మత్తుమందులు ఇచ్చి 7 నెలలపాటు అనేక మంది పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ సంఘటన చెన్నైలో జరిగింది. ఈ కేసులో 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం కోర్టుకు తీసుకురాగా న్యాయవాదులే మూకుమ్మడిగా నిందితులపై దాడి చేశారు. నిందితుల తరఫున ఏ లాయరూ వాదించరని న్యాయవాదుల సంఘం తేల్చి చెప్పింది. కోర్టు నిందితులకు జూలై 31 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. చెన్నైలోని అయణవరం ప్రాంతంలో ఉన్న ఓ అపార్టుమెంటులో బాలిక నివసిస్తోంది.

అదే అపార్టుమెంటులో పనిచేస్తున్న లిఫ్ట్‌ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌ సహా పలువురు నిర్వహణ సిబ్బంది బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. 7వ తరగతి చదువుతున్న ఈ బాలికపై అత్యాచారం చేసే ముందు నిందితులు ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాలను తాగించడం, పొడి రూపంలో ఉన్న మాదక ద్రవ్యాలను ముక్కుతో పీల్చేలా చేసేవారని వెల్లడించారు. బాలికపై దారుణానికి పాల్పడుతూ వీడియోలు కూడా తీశారన్నారు.

తొలుత లిఫ్ట్‌ ఆపరేటర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడగా, ఆ తర్వాత పలువురు అతనికి జత కలిసి 7 నెలల పాటు ఆమెను హింసించారని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తన అక్కకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తండ్రి ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘11 మంది తనపై అత్యాచారం చేశారని అమ్మాయి చెప్పింది. వారికి సహకరించిన మరో ఆరుగురిని కూడా కలిపి మొత్తం 17 మందిని అరెస్టు చేశాం’ అని పోలీసులు చెప్పారు. దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణించి విచారణ చేస్తున్నామన్నారు.

నిందితులపై లాయర్ల దాడి
నిందితులందరినీ మంగళవారం పోలీసులు మహిళా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిందితులను కోర్టు నుంచి బయటకు తీసుకొస్తుండగా అక్కడ ఉన్న దాదాపు 50 మంది న్యాయవాదులు వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో నిందితులను రెండు గదుల్లో ఉంచి పోలీసులు రక్షణ కల్పించారు. లాయర్లకు భయపడి దాదాపు 5 గంటలు వారంతా ఆ గదుల్లోనే ఉన్నారు. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో లాయర్లు శాంతించడంతో నిందితులను కస్టడీకి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top