‘శవాలను తొక్కుకుంటూ...పరుగులు పెట్టారు’

Survivor Of Bus Tragedy Says Some Climbed On Bodies To Get Out Of Bus - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకున్న బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన కారణంగా తమ సర్వస్వం కోల్పోయామని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  లక్నో నుంచి ఢిల్లీకి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో 29 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం తనకు అలవాటు..
బస్సు ప్రమాదంలో మృతి చెందిన అరీబా ఖాన్‌ తల్లి మాట్లాడుతూ...‘ తను నవీ ముంబైలో నివసించేది. ఉద్యోగం చేస్తూ కుటుంబం మొత్తాన్ని తనే పోషిస్తోంది. సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం అంటే తనకు మహా సరదా. గత నెలలో వాళ్ల నాన్నకు గుండెపోటు వచ్చినపుడు ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి తనను నేరుగా చూసింది లేదు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పర్యటించే తను ఇలా శాశ్వతంగా మాకు దూరమవుతుందని ఊహించలేదు. తనకంటే చిన్న వాళ్లైన తోబుట్టువులను గారాం చేసే అక్క ఇక లేదు’ అంటూ మార్చురీ బయట హృదయ విదారకంగా విలపించింది. ఇక ఇదే ప్రమాదంలో మరణించిన లక్నోకు చెందిన అవినాశ్‌ అవస్థి కుటుంబ సభ్యులు కూడా పెద్ద దిక్కును కోల్పోయామంటూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నూతన గృహ ప్రవేశం అనంతరం ఆఫీసుకు తిరిగి వెళ్లే క్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

చదవండి : యూపీలో ఘోరం

శవాలపై నడుచుకుంటూ..
ఈ ఘోర ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ రిషి యాదవ్‌ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ..‘ మేమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు రెండుసార్లు కుదుపులకు లోనైంది. ఆ వెంటనే నాలాలో పడిపోయింది. ఒక్కసారిగా అరుపులు, కేకలతో బస్సు దద్దరిల్లింది. నాలాలో పడిన తర్వాత బస్సు నుంచి బయటికి వచ్చేందుకు శవాలను తొక్కుకుంటూ కొంతమంది పరుగులు తీశారు. దేవుడి దయ వల్ల నేను స్వల్ప గాయాలతో బయటపడ్డాను’ అని భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడు ఆగ్రాలోని శ్రీకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక అందజేయాలని సీఎం ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top