
మౌనిక (ఫైల్)
మీర్‌పేట: హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఇష్టంలేక ఓ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం, నర్సంపల్లి గ్రామానికి చెందిన వల్లదాసు పెద్దయ్య బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి జిల్లెలగూడ బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. అతడి పెద్ద కుమార్తె మౌనిక (17)ను ఇంటర్మీడియట్ చదివేందుకు సిద్దిపేట జిల్లా, సముద్రాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ హాస్టల్‌లో చేర్పించాడు. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదని ఆమె పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పింది. ఈ నెల 22న హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం తల్లి అలివేలు బయటికు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకే మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.