కథువా అత్యాచారం, హత్య కేసులో తుది తీర్పు  | Six Persons Convicted By Pathankot Court In Kathua Murder Case | Sakshi
Sakshi News home page

కథువా రేప్‌ కేసు: ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

Jun 10 2019 12:06 PM | Updated on Jun 10 2019 12:24 PM

Six Persons Convicted By Pathankot Court In Kathua Murder Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ స్పెషల్ కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్‌, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్‌ ఖజూరియా, సురేందర్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌ల, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. అయితే సాంజీ రామ్‌ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దోషులకు న్యాయస్థానం మధ్యాహ్నం శిక్షలు ఖరారు చేయనుంది.

చదవండి: కథువా కేసు.. వాళ్ల పనే! 

కాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే.  బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. 

ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్‌, అతని కొడుకు విశాల్‌, మైనర్‌ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్‌ పోలీస్ ఆఫీసర్లు దీపక్‌ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే సాంజిరామ్‌ నుంచి  నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్‌, సబ్ ఇన్సిపెక్టర్‌ ఆనంద్‌ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది.

మొత్తం ఎనిమిదిమంది నిందితులు ఉండగా.. వారిలో ఏడుగురిపై అత్యాచారం, హత్య అభియోగాలపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. మైనర్‌ మాత్రం ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌ కోర్టు వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement