కథువా కేసు.. వాళ్ల పనే!

Kathua Case Defense Lawyer Alleges Jihadis Behind Incident - Sakshi

ఎనిమిదేళ్ల చిన్నారి కిరాతకంగా హత్యాచారానికి గురైన కేసులో నిందితుడి తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘోరం వెనుక ఉంది జిహాదీలే తప్ప.. తన క్లైయింట్లు కాదని వ్యాఖ్యానించాడు. పథాన్‌కోట్‌ జిల్లా మరియు సెషన్స్‌ న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సాంజీ రామ్‌ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయగా.. ఆ మరుసటి రోజే సాంజీరామ్‌ తరపు న్యాయవాది అంకుర్‌ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. (నోరు విప్పిన సాంజిరామ్‌.. అందుకే చంపా!)

‘ఇది ముమ్మాటికీ జిహాదీల పనే. జమ్ము కశ్మీర్‌లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం వాళ్ల ఎజెండా. అందుకే బాలికను క్రూరంగా చంపి అక్కడ పడేశారు. నా క్లైయింట్లకు ఏ పాపం తెలీదు. కుట్రపూరితంగా వారిని ఇరికించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపడితే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ మేరకు గవర్నర్‌ వోహ్రాను కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని అంకుర్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ ఘటన తర్వాత నోమాదిక్‌ తెగ వారికి ప్రభుత్వ స్థలాల్లో ఆశ్రయాలను ఏర్పాటు చేసుకునేందుకు అప్పుడు సీఎంగా ఉన్న మెహబూబా ముఫ్తీ ఇచ్చిన ఆదేశాలు.. ఇప్పటికీ కొనసాగటంపై అంకుర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. తక్షణమే ఆ ఆదేశాలను రద్దు చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు అంకుర్‌ తెలిపాడు. (‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు)

అయితే న్యాయ నిపుణులు మాత్రం అంకుర్‌ వ్యాఖ్యలపై ఆశ‍్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై నేరారోపణలు నమోదు అయ్యాక.. (నిందితుడి నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు కూడా...) న్యాయవాది అంకుర్‌ ఇలా ఎలా వ్యాఖ్యలు చేయగలుగుతున్నారని వారు మండిపడుతున్నారు. కథువాకు సమీపంలోని ఓ గ్రామంలో నోమాదిక్‌ తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి.. వారంపాటు పైశాచికంగా లైంగిక దాడి చేసి మరీ హతమార్చారు. ఈ ఘటన కథువా కేసుగా ప్రప్రంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top