కథువా కేసు.. నోరు విప్పిన సాంజిరామ్‌

Sanji Ram Confess kathua Rape and Murder Case - Sakshi

శ్రీనగర్‌: సంచలనం సృష్టించిన కథువా హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాంజి రామ్‌ ఎట్టకేలకు నోరు మెదిపాడు. విచారణలో పోలీసులకు అతను దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడించాడు. కుమారుడిని రక్షించుకునేందుకు ఆ బాలికను చంపినట్లు సాంజి రామ్‌ తెలిపాడు. హిందూ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం నుంచి నోమాదిక్‌ గుజ్జర్‌, బకర్వాల్‌ తెగలను తరిమికొట్టాలన్న ఉద్దేశంతోనే తాము ఈ ఘటనకు పాల్పడినట్లు సాంజి రామ్‌ వివరించాడు. 

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి 7వ తేదీ నుంచే బాలిక కిడ్నాప్‌​ కోసం సాంజి రామ్‌ ప్రణాళిక అమలు చేశాడు.  జనవరి 10న మత్తుమందు ఇచ్చి బాలికను అపహరించి ఆలయానికి తరలించారు. అదే రోజు సాంజిరామ్‌ మేనల్లుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడి జరిగిన విషయం 13వ తేదీన తనకు తెలిసిందని సాంజిరామ్‌ వివరించాడు. తన కుమారుడితోపాటు అల్లుడు కూడా బాలికపై  లైంగిక దాడికి పాల్పడ్డారని.. వారిని రక్షించుకునేందుకే ఆ బాలికను చంపేసినట్లు సాంజి రామ్‌ దర్యాప్తు బృందానికి చెప్పారు. 

జనవరి 13 అర్ధరాత్రి విశాల్(సాంజిరామ్‌ కొడుకు)‌, అతని స్నేహితుడు పర్వేశ్‌ కుమార్‌(మన్ను).. ఆలయం నుంచి బాలికను బయటకు తీసుకొచ్చారు. చంపేముందు మరోసారి అత్యాచారం చేస్తానని పోలీసాధికారి దీపక్‌ ఖజూరియా నిందితులతో చెప్పాడు. కానీ, పరిస్థితులు సహకరించకపోవటంతో బాలికను తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు అంటే.. జనవరి 14న బాలికను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత బాలిక మృతదేహాన్ని హీరానగర్‌ కాలువ వద్ద పడేయాలని పథకం రచించారు. విశాల్‌, ఖజూరియా, పర్వేశ్‌ కుమార్‌, మైనర్‌ బాలుడు అంతా కలిసి బాలిక మృతదేహాన్ని ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. రామ్‌ బయట కాపలాకాశాడు. చివరకు కారు దొరక్కపోవటంతో జనవరి 15వ తేదీ మధ్యాహ్నం విశాల్‌, సాంజిరామ్‌ మేనల్లుడు కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృత దేహాన్ని పడేసి వచ్చారు. అయితే సాంజిరామ్‌ స్టేట్‌మెంట్‌పై స్పందించేందుకు అతని తరపు న్యాయవాది నిరాకరించారు.

ఛార్జీ షీట్‌ వివరాలు... మైనర్‌ బాలుడితోపాటు, సాంజిరామ్‌, అతని తనయుడు విశాల్‌, సాంజిరామ్‌ అల్లుడు, పోలీస్‌ అధికారులు ఖజూరియా, సురేందర్‌ వర్మ, పర్వేశ్‌ కుమార్‌ పేర్లతో ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. సాంజిరామ్‌పై హత్య, అపహరణ, ఆధారాలను మాయం చేయటం.. పర్వేశ్‌ కుమార్‌(మన్ను)పై అపహరణ కింద కేసు నమోదు చేశారు. సాంజిరామ్‌ నుంచి నాలుగు లక్షలు తీసుకుని ఆధారాలు మాయం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై హెడ్‌ ​కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ దత్తాల పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.

  • జనవరి 17న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు
  • జనవరి 23న కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేయగా.. సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్‌ 8 మందిని అరెస్ట్‌ చేసింది.
  • సుప్రీం కోర్టు జోక్యంతో ఏప్రిల్‌ 16న కేసులో విచారణ ప్రారంభం.. తదుపరి విచారణ ఏప్రిల్‌ 28కి వాయిదా. 
  • ఈ కేసు విచారణ జమ్ము కశ్మీర్‌ కోర్టులో చేయవద్దని.. ఛండీగఢ్‌ కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. 
  • ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని దిగువ న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. 
     
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top