కామాంధుడైన కన్నతండ్రి పాశవిక హత్య

Sisters Face Murder Trial Who Killed Father Over Molestation In Russia - Sakshi

మాస్కో: తండ్రి లైంగిక వేధింపులు భరించలేక కన్న కూతుళ్లు అతడిని హతమార్చారు. కత్తితో పొడిచి.. సుత్తితో తండ్రి తలను మోది అంతమొందించారు. 2018లో రష్యాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు మంగళవారం స్థానిక కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నేరం రుజువైతే నిందితురాళ్లకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. వివరాలు... రష్యాకు చెందిన క్రెస్టీనా(20), ఏంజిలీనా(19), మారియా కాచాతుర్యాన్‌(18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి మైఖేల్‌తో కలిసి నివసించేవారు. అయితే మైఖేల్‌ ఎల్లప్పుడూ వారిని శారీరంగా హింసిస్తూ.. లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. రష్యాలో గృహహింసకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక చట్టం లేకపోవడంతో అతడి ఆగడాలు మరింతగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో తండ్రిపై ద్వేషం పెంచుకున్ను అక్కాచెల్లెళ్లు ముగ్గురు గతేడాది జూలైలో అతడిని హత్య చేశారు. కత్తితో పలుమార్లు దాడి చేసి.. సుత్తితో కొట్టి చంపారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సంపాదించినట్లు విచారణ అధికారులు మంగళవారం పేర్కొన్నారు. ఈ మేరకు క్రెస్టీనా, ఏంజెలీనాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారిద్దరూ ఉద్దేశపూర్వకంగానే తండ్రి మైఖేల్‌ను హత్య చేసినట్లు కోర్టుకు తెలిపారు. అంతేగాక మారియాకు సైక్రియాట్రిస్ట్‌తో చికిత్స అందించాలని సూచించారు. ఈ క్రమంలో క్రెస్టీనా, ఏంజెలీనాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రష్యా చట్టాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గృహహింస చట్టం లేనందు వల్లే ఇద్దరు అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి తలెత్తిదంటూ మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మహిళా హక్కుల కార్యకర్త అన్నా రివీనా ఈ విషయం గురించి మాట్లాడుతూ... ‘ విచారణాధికారుల ప్రకటన గృహహింసను ప్రోత్సహించేందిగా కనిపిస్తోంది. ఆత్మ రక్షణ కోసం చేసిన పనిని నేరంగా చిత్రీకరించడం దారుణం. అసలు సమస్య ఏంటో ఎవరికీ పట్టడం లేదు. పౌరుల జీవితాన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top