ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన బస్సు

RTC Bus Accident To Mahindra Bolero And DCM Truck - Sakshi

మూసాపేట (దేవరకద్ర): రిపేరు కోసం ఆగిన బొలెరో వాహనాన్ని కర్నూలు జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దానిని తప్పించబోయి ఆ పక్క నుంచే కూరగాయల లోడుతో వస్తున్న మరో డీసీఎం వాహనం బోల్తా పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున మూసాపేటలోని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నుంచి వస్తున్న హైటెక్‌ బస్సు తెల్లవారుజామున మూసాపేట హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోకి రాగానే రిపేరు నిమిత్తం రోడ్డు పక్కనే ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో బోల్తా పడింది. దానిని తప్పించబోయి వె నక నుంచే వస్తున్న డీసీఎం వాహనం బోల్తా పడింది. గురువా రం ఉదయం ఎల్‌అండ్‌టీ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా పడిన డీసీఎం వాహనాన్ని క్రేన్‌ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్పగాయాలవడంతో ఎల్‌అండ్‌టీ సిబ్బంది అంబులెన్స్‌లో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు బొలెరో వాహన యజమానిపై మూసాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యుత్‌ తీగలు తెగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం  
మూసాపేట (దేవరకద్ర): హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తెగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సంఘటన మూసాపేటలోని హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా.. మూసాపేట పోలీసుస్టేషన్‌ ముందు నుంచి లాగిన 11 కేవీ విద్యుత్‌ తీగలు ఒక్కసారిగా తెగి జాతీయ రహదారిపై పడటంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి గాలి దుమారం లేకుండానే తీగలు తెగిపడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మూసాపేట పోలీసులు వెంటనే విద్యుత్‌ అధికారులకు సమాచారం చేరవేసి సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఘటనా స్థలానికి విద్యుత్‌ అధికారులు వచ్చి తీగలను తొలగించడంతో పోలీసులు ఇరువైపులా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top