బదిలీలలు..

Recommended transfers in warangal police commissionerate

పోస్టింగులకు సిఫార్సుల ఒత్తిడి

పనితీరు కంటే ప్రతిపాదనలకే ప్రాధాన్యం

ఏడాది తిరగక ముందే స్థానచలనం

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బాగోతం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల కాలంలో సిఫార్సు బదిలీలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఒక స్టేషన్‌లో పోస్టింగ్‌ వస్తే కనీసం రెండేళ్లు అక్కడ విధులు కొనసాగిస్తారు. అవినీతి ఆరోపణలు, సమర్థత విషయంలో తేడాలు వస్తే బదిలీలు జరుగుతాయి. ఇప్పుడు ఈ విధానంలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఎమ్మెల్యేలకు అనుగుణంగా వ్యవహరించని పక్షంలో ఆయా స్టేషన్ల్ల నుంచి ఎస్సైలు, సీఐల బదిలీలు వెనువెంటనే జరిగిపోతున్నాయి. ఇటీవల నగర పరి«ధిలో కొన్ని కీలక పోలీస్‌ స్టేషన్లకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలకు, పోలీసు సిబ్బందికి మ«ధ్య సఖ్యత చెడడంతో బదిలీలకు రంగం సిద్ధమైంది. తమ నియోజకర్గపరి«ధిలో ఉన్న స్టేషన్‌కి తమకు అనుకూలంగా ఉండే వారిని సీఐగా నియమించాలంటూ నగర పరిధిలోని ఓ ఎమ్మెల్యే లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అర్ధాంతరంగా బదిలీలు జరుగుతాయనే ప్రచారం జోరందుకుంది.

కమిషనరేట్‌ పరిధిలో బదిలీ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న స్టేషన్లలో కాజీపేట, సుబేదారి, హన్మకొండ ట్రాఫిక్, మట్టెవాడ,  సీసీఎస్, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి స్టేషన్లు ఉన్నాయి. ఇందులో పశ్చిమ నియోజ వర్గంలోని రెండు స్టేషన్లకు చాలా పోటీ ఉంది. ఇందులో ఒక పోలీస్‌ స్టేషన్‌లో సీఐని పోస్టింగ్‌ పొందిన పది నెలలకే బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. నగర పరిధిలోని ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించకపోవడం ఈ బదిలీ వెనుక కారణంగా తెలుస్తోంది. రియల్‌ వ్యవహారాల్లో వచ్చిన తేడాలతో ప్రస్తుతం ఉన్న అధికారిని మార్చి తమ కుటుంబ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించే మరో అధికారిని ఈ సీటులో కూర్చోబెట్టేందుకు సదరు ఎమ్మెల్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం 20 రోజుల క్రితం సిఫార్సు చేసినట్లు సమాచారం. కనీసం ఏడాది కాకముందే బదిలీ చేస్తే నలువైపుల నుంచి విమర్శలు వస్తాయనే మీమాంసలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తానికి చీటికిమాటికి బదిలీలు జరుగుతుండడంపై పోలీస్‌ శాఖలోనే భిన్న స్వరాలు వినపడుతున్నాయి.

ఇబ్బందికర పరిస్థితి...
పోలీసు శాఖలో ఎమ్మేల్యేల సిఫారసు లేఖలతో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల చల్లని చూపుదక్కిన వారికే కోరుకున్న చోట పోస్టింగులు దక్కుతుండడంతో మంచి పోస్టింగు కోసం ఎస్సైలు, సీఐలు ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బదిలీల్లో ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ప్రభావం కారణంగా సమర్థులుగా పేరున్న అధికారులకు కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సిఫారసు విధానంపై ఇప్పటికే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమకు అనుకూలంగా ఉండే స్టేషన్లలో నియమించుకోవడం.. ఇందుకోసం అక్కడ పని చేస్తున్న వారికి అకారణంగా బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. కాజీపేట స్టేషన్‌ కోసం ఇప్పటికే మూడు లేఖలు అందినట్లు సమాచారం. సుబేదారి స్టేషన్‌ కోసం గతంలో పోలీసుల అధికారుల సంఘం నేతగా పనిచేసిన ఓ ఇన్‌స్పెక్టర్‌ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పనితీరు, సమర్థతలను మించి సిఫార్సు లేఖలు పవర్‌ఫుల్‌ కావడంతో పోలీసు అధికారుల పనితీరుపై ప్రభావం చూపుతుందనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top