సాక్షి, హైదరాబాద్: నగర పౌరులకు అప్‌డేట్లు అందించేందుకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను బుధవారం ప్రారంభించారు. భారత్‌లో అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని, తాజా అప్ డేట్లను మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఈ ఛానెల్‌ను వెంటనే ఫాలో కావాలంటూ సీపీ కోరారు.
కాగా, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అధిక అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్ క్లోనింగ్‌లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్ వర్డ్’తో రక్షణ పొందాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డీప్‌ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్ ఫేక్, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ‘సురక్షిత పదం’ (సేఫ్ వర్డ్)ను ఉపయోగించాలన్నారు.
మంగళవారం(అక్టోబర్ 28) తన ‘ఎక్స్’ ఖాతాలో నగర సీపీ సజ్జన్నార్..ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: డీప్ ఫేక్‌కు కోడ్ వర్డ్‌తో చెక్


