హైదరాబాద్ సిటీ కమిషనర్ వీసీ సజ్జనర్
ఇలాంటి సేఫ్ వర్డ్స్ ఏర్పాటు చేసుకునే వాళ్లు కొన్ని రకాలైన ప్రాథమిక జాగ్రత్తలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని సామాజిక మాధ్యమాల్లో ఉన్న గ్రూపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. మర్చిపోవడం, పొరపాటు పడటం వంటి వాటికి తావు లేకుండా దీన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చెయ్యాలి.
ఆడియోలు, వీడియోల్లోకీ చొచ్చుకుపోయిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను సవాల్ విసురుతోంది. మనం వింటున్న మాట, మనతో మాట్లాడుతున్న వ్యక్తి, చూస్తున్న వీడియో అసలా.. లేక ఏఐ సృష్టా అనేది గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. దీన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. డీప్‌ఫేక్‌తో కుటుంబీకుడిగా, బంధువుగా, స్నేహితుడిగా ‘మారిపోయి’ ఫోన్ కాల్ చేసి, ఆడియో, వీడియోల ద్వారా వివిధ అత్యవసర కారణాలు చెప్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండాలంటే ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఓ కోడ్ వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దీన్నే సేఫ్ వర్డ్‌గా కొత్వాల్ అభివర్ణించారు.
ఆ విభాగాల్లో ఉన్న మాదిరిగానే...
గూఢచర్య సంబంధిత చిత్రాల్లో సీక్రెట్ ఏజెంట్స్‌కు కోడ్ వర్డ్స్ ఉండటం చూస్తూనే ఉంటాం. ప్రత్యేక ఆపరేషన్స్‌లో కమాండోలు సైతం ఇలాంటి ఏర్పాటు చేసుకుంటారు. ‘జేమ్స్ బాండ్ 007’ ఈ తరహాకు చెందిన కోడ్ వర్డే. ఏజెంట్లుగా పని చేస్తున్న వాళ్లు తమ గుర్తింపు ఎదుటి వాళ్లకు తెలియకుండా, ఉన్నతాధికారులతో ఫోన్ లేదా ఇతర సాధనాల ద్వారా సంప్రదింపులు జరిపేప్పుడు వారు మాత్రమే గుర్తించేలా వీటిని ఏర్పాటు చేసుకుంటారు.
ఇదే విధానాన్ని డీప్‌ఫేక్‌కు చెక్ చెప్పడానికి అమలు చేయాలని కొత్వాల్ సజ్జనర్ సూచిస్తున్నారు. కోడ్ వర్డ్‌గా పిలిచే ఈ సేఫ్ వర్డ్‌ను కుటుంబీకులు, బంధువులు, స్నేహితులతోపాటు సహోద్యోగులు, సన్నిహితులకు మాత్రమే తెలపాలి. ఏదైనా అత్యవసరం అయి ఫోన్ చేయాల్సి వచ్చినా, సందేశం పంపాల్సి వచ్చినా ఈ కోడ్‌తోనే పరిచయం చేసుకుంటానని స్పష్టం చేయాలి. ఇలా ఎదుటి వాళ్లు సైతం తమతో మాట్లాడేది ఫలానా వ్యక్తా కాదా అనేది స్పష్టంగా తెలుసుకుంటారు.
ఈ విషయాలు మాత్రం మరవద్దు...
ఇలాంటి సేఫ్ వర్డ్స్ ఏర్పాటు చేసుకునే వాళ్లు కొన్ని రకాలైన ప్రాథమిక జాగ్రత్తలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని సామాజిక మాధ్యమాల్లో ఉన్న గ్రూపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. మర్చిపోవడం, పొరపాటు పడటం వంటి వాటికి తావు లేకుండా దీన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చెయ్యాలి. ఎదుటి వ్యక్తికి–మనకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత అంశంపై ప్రశ్నలు అడగడం తదితరాలను అదనపు ధ్రువీకరణలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏఐ ద్వారా సృష్టించే డీప్ ఫేక్స్‌ను గుర్తించడం కష్టసాధ్యమవుతున్న ఈ తరుణంలో సేఫ్ వర్డ్స్ రక్షణ ఇస్తాయని అబీప్రాయపడుతూ సజ్జనర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. – శ్రీరంగం కామేష్, సాక్షి


