అండగా ఉన్నాడని హత్య | Police Chased A Murder Case In Vizianagaram | Sakshi
Sakshi News home page

అండగా ఉన్నాడని హత్య

Oct 1 2019 8:31 AM | Updated on Oct 1 2019 8:31 AM

Police Chased A Murder Case In Vizianagaram - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ శ్రీధర్‌ (వృత్తంలో నిందితులు)  

సాక్షి, డెంకాడ(విజయనగరం) : మండలంలోని పెదతాడివాడ పంచాయతీ పరిధిలోని విజయనగరం–నాతవలస ఆర్‌అండ్‌బీ రహదారికి ఆనుకుని అరుణోదయ స్టీల్స్‌ ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఈనెల 25వ తేదీన శవమైన కనిపించిన అంబటి నాగరాజు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భోగాపురం సీఐ సీహెచ్‌ శ్రీధర్‌ విలేకరుల సమావేశంలో అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణంలో అశోక్‌ నగర్‌కు చెందిన ఆసనాల చినఅప్పన్న, ఆసనాల పైడిరాజలు అన్నదమ్ములు. వీరు పందుల పెంపకం చేపడుతూ కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. పైడిరాజు వద్ద అంబటి నాగరాజు, సురేష్‌ పందుల కాపర్లుగా పని చేస్తున్నారు. డెంకాడ మండలంలోని పద్మావతినగర్‌ లే అవుట్‌లో చిన అప్పన్న, పైడిరాజులకు చెందిన పందులు పక్కపక్కనే ఉంచుతున్నారు. దీంతో పందులు ఉంచే స్థలంతో పాటు కొన్ని పందులు కనిపించకుండా పోతున్న విషయంలో ఇద్దరు అన్నదమ్ములైన ఆసనాల చినఅప్పన్న, ఆసనాల పైడిరాజుల మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడం.. అది కాస్త కొట్లాటకు దారితీయడంతో ఆసనాల పైడిరాజు గాయపడ్డాడు. వివాదం సమయంలో గాయపడిన పైడిరాజుకు అండగా అంబటి నాగరాజు ఉన్నాడన్న కోపంతో చిన అప్పన్నతో పాటు కుమారులు ఆసనాల శివ, కల్యాణ్‌లు నాగరాజుపై కోపం పెంచుకున్నారు. 

దీంతో తండ్రీ కొడుకులైన చినఅప్పన్న, శివ, కల్యాణ్‌లు నాగరాజును మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదే అదునుగా ఈనెల 24వ తేదీ రాత్రి దాసన్నపేట రింగ్‌రోడ్డు వద్దనున్న పెట్రోల్‌ బంకు వద్ద వాహనంపై వస్తున్న అంబటి నాగరాజును శివ, కల్యాణ్‌లు అడ్డుకుని వారి ద్విచక్ర వాహనంపై పందులు ఉంచే పద్మావతినగర్‌ లే అవుట్‌లోకి తీసుకువచ్చారు. అక్కడ శివ, కల్యాణ్‌లు అంబటి నాగరాజుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వైరుతో ఉరి వేసి చంపేసి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై వేసుకుని పెదతాడివాడ పంచాయతీ పరిధిలోని ఆరుణోదయ స్టీల్స్‌ ఎదురుగా ఉన్న మామిడి తోటలో పడేశారు. కొడుకు కనిపించకపోవడంతో అంబటి నాగరాజు తల్లి చల్లమ్మ డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగరాజు మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో డెంకాడ ఎస్సై హరిబాబునాయుడు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఆసనాల శివ, కల్యాణ్‌లను చొల్లంగిపేట ప్రాంతంలో పట్టుకోగా.. వారి తండ్రి చిన అప్పన్న డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో ముగ్గురిపై ఎస్సై హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement