క్రేన్‌పై నుంచి పడి పెయింటర్‌.. | Painter Accidental Death In Anathapur | Sakshi
Sakshi News home page

క్రేన్‌పై నుంచి పడి పెయింటర్‌ దుర్మరణం  

Jun 28 2019 10:36 AM | Updated on Jun 28 2019 10:38 AM

Painter Accidental Death In Anathapur - Sakshi

సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : క్రేన్‌పై నుంచి పడి ఓ పెయింటర్‌ దుర్మరణం చెందిన ఘటన పట్టణంలోని మోదీనాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మోదీనాబాద్‌లోని హంపయ్యబాబు కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ రాజశేఖర్, ప్రమీల దంపతులకు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు సాయిచంద్‌(20) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం  ఆర్‌పీఎఫ్‌ పోలీసుస్టేషన్‌ సమీపంలో రైల్వే అధికారులు నిర్మిస్తున్న గోల్ఫ్‌ కోర్టు (క్రీడా మైదానం)లో పనికి వెళ్లాడు.

ఈ క్రీడా మైదానం ప్రహరీ వద్ద ఏర్పాటు చేసిన స్తంభానికి సాయిచంద్, తన సన్నిహితుడు హుసేనప్పతో కలిసి క్రేన్‌కు లింకప్‌ చేసిన బక్కెట్‌లో నిలబడి పెయింటింగ్‌ చేస్తున్నాడు. ఉన్నట్టుండి పెయింటర్స్‌ నిలబడిన బకెట్‌ హుక్‌ తెగిపోయింది. ఈ ఘటనలో 15 అడుగుల ఎత్తు నుంచి ఇద్దరూ కాలువపై ఏర్పాటు చేసిన కాంక్రీట్‌ బండపై పడ్డారు.  ప్రమాదంలో సాయిచంద్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. హుసేనప్ప కుడి చేయి విరిగి బలమైన రక్తగాయాలయ్యాయి. సాయిచంద్‌ మృతదేహాన్ని, గాయపడిన హుసేనప్పను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

మిన్నంటిన రోదనలు 
ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మృతుడు సాయిచంద్‌ కుటుంబ సభ్యుల రోదనలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న కొడుకు  మృతి చెందడంతో సాయిచంద్‌ తల్లి ప్రమీళమ్మ స్పృహ కోల్పోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement