వివాహేతర సంబంధమే కారణం!

Mystery of Karthik murder case was revealed - Sakshi

వీడిన కార్తీక్‌ హత్య కేసు మిస్టరీ 

ఇనుప రాడ్‌తో కొట్టి కార్తీక్‌ను హత్య చేసిన రవి  

నేరం తనపైకి వస్తుందనే భయంతో రాగసుధ ఆత్మహత్య 

ముగ్గురు నిందితుల అరెస్టు  

వివరాలు వెల్లడించిన గద్వాల డీఎస్పీ

గద్వాల క్రైం: మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలలో సంచలనం సృష్టించిన కార్తీక్‌ హత్య, రాగసుధ ఆత్మహత్య కేసు చిక్కుముడి వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే కార్తీక్‌ హత్యకు గురయ్యాడని.. ఆ నేరం తనపైకి వస్తుందనే ఆందోళనతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గద్వాల డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు. రాగసుధ, కార్తీక్‌ ఇంటర్‌లో క్లాస్‌మేట్స్‌.. రవి వీరి కంటే సీనియర్‌. కొన్నేళ్ల క్రితం రాగసుధకు మహబూబ్‌నగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో వివాహమైంది. గతంలో రాగసుధకు కార్తీక్, రవితో ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రవితో చనువుగా ఉండటం గమనించిన కార్తీక్‌.. రాగసుధను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో కార్తీక్‌ నుంచి తనకు విముక్తి కలిగించాలని రాగసుధ రవికి చెప్పింది. దీంతో అతను కార్తీక్‌ అడ్డు తొలగించాలనుకున్నాడు. ఫిబ్రవరి 24న కార్తీక్‌ రాగసుధకు ఫోన్‌ చేయగా.. ఆ విషయాన్ని ఆమె రవికి చెప్పింది. (ప్రాణాలు తీసిన ఫేస్బుక్ చాటింగ్)

కార్తీక్‌ ఎక్కడున్నాడో ఫోన్‌ చేసి తెలుసుకున్న రవి.. అతనిని శ్రీనివాస్‌నగర్‌ కాలనీలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో కలిశాడు. అక్కడ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్తీక్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు వసంత్, అనిల్‌ను రవి తన కారులో ఎక్కించుకుని రాత్రి ఒంటిగంట సమయంలో గద్వాల వెళ్లాడు. అక్కడ మరో మారు వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి.. కార్తీక్‌ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కార్తీక్‌ను కారు డిక్కీలో వేసుకుని రవి నిర్వహిస్తున్న డెకరేషన్‌ షాప్‌ వద్దకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున కార్తీక్‌ను లేపేందుకు ప్రయత్నించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో అదే కారులో మేలచెర్వు గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి పాతిపెట్టారు.

మిస్సింగ్‌ కేసు నమోదుతో వెలుగులోకి..
కార్తీక్‌ 24వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి సూరిబాబు ఫిబ్రవరి 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని గద్వాలకు చెందిన కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పడంతో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కార్తీక్‌ను హత్య చేసినట్లుగా రవికుమార్, వసంత్, అనిల్‌లు ఒప్పుకున్నారు. హత్యకు గురైన కార్తీక్‌ను పూడ్చిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. అయితే ఈ కేసులో మరో ఆరుగురు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top