చిచ్చురేపిన ఫేస్బుక్ చాటింగ్

యువకుడి దారుణ హత్య
వివాహితను వేధింపులకు గురిచేయడమే కారణమా..?
సదరు మహిళ సైతం ఆత్మహత్య
హత్యానేరం తనపైకి వస్తుందని అఘాయిత్యం
పోలీసుల అదుపులో నిందితులు?
సాక్షి, గద్వాల క్రైం/ మహబూబ్‌నగర్ క్రైం: ఫేస్బుక్ చాటింగ్.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. డిగ్రీలో ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడినా ఆమె పట్టించుకోలేదు. అనంతరం ఆ యువతికి వేరొకరితో వివాహమై ఏళ్లు గడిచాక ఫేస్ బుక్ ద్వారా తిరిగి పరిచయం చేసుకున్నాడు. మంచి ఫ్రెండ్‌గా ఉంటానంటూ.. వ్యక్తిగత విషయాలు తెలుసుకొని మళ్లీ వేధించసాగాడు. ఈ క్రమంలోనే సదరు యువకుడు దారుణ హత్యకు గురికావడం.. ఈ హత్యానేరం తనపైకి వస్తుందని సదరు వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనలు గద్వాల, మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్నాయి.
గద్వాల జిల్లా వెంకటరమణ కాలనీకి చెందిన రాగ సుధ (29), అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ (31) డిగ్రీ క్లాస్మెట్లు. అప్పట్లో కార్తీక్ సుధను ప్రేమించమని వేధించేవాడు. ఈ క్రమంలో సుధకు 2011లో మహబూబ్‌నగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో వివాహమైంది. ప్రస్తుతం వారికి ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది కిందట కార్తీక్ ఫేస్బుక్ ద్వారా మళ్లీ సుధకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి పరిచయం అయ్యాడు. కొంతకాలం స్నేహంగా ఉన్నా సుధ.. తర్వాత అతడిని దూరం పెడుతూ వచ్చింది. దీంతో కార్తీక్ ఆమెను పలు రకాలుగా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ‘నువ్వు నాతో మాట్లాడకపోతే వివాహేతర సంబంధం ఉందని నీ భర్తకు చెబుతా.. అలాగే, నీ భర్తను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు.
కార్తీక్ దారుణ హత్య
ఇదిలా ఉండగా.. గద్వాలలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కార్తీక్.. ఈ నెల 24వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. తమ కుమారుడు కనిపించడం లేదని కార్తీక్ తండ్రి నాగేందర్ 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి గద్వాల మండలం మేళ్లచెర్వు (99ప్యాకేజీ) గుట్టల సమీపంలో పూడ్చినట్లు శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైంది కార్తీక్ అని సమాచారం. అయితే.. మృతదేహం వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. శనివారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.
సుధ బలవన్మరణం
ఈ క్రమంలో తనను వేధింపులకు గురి చేసిన కార్తీక్ మృతి చెందాడనే విషయం తెలుసుకుని రాగ సుధ ఆందోళనకు గురైంది. ఆ నేరం తనపైకి వస్తోందని భావించి భయంతో శుక్రవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు 11.45 గంటలకు సుధ తన తండ్రి నాగేందర్‌కు ఫోన్ చేసి తాను మానసిక ఒత్తిడిలో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుం టున్నానని, నా కొడుకును బాగా చూసుకోవాలని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆందోళనకు గురైన నాగేందర్ విషయాన్ని వారి బంధువులకు చెప్పగా.. ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె విగతజీవిగా కనిపించింది. కాగా, కార్తీక్ హత్య నేరం తనపైకి వస్తుందనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న సుధ.. తన సూసైడ్ లెటర్లో కార్తీక్ తన జీవితంలో చిచ్చురేపాడని, అతడిని వదిలిపెట్టవద్దని రాసింది. ఇలా పరస్పర విరుద్ధ వాదనలు తెరపైకి రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్తీక్‌ను హత్య చేసిందెవరు?
కార్తీక్‌ను హత్య చేసింది ఎవరు.. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. కార్తీక్ స్నేహితుడు కూడా ఫేస్బుక్ ద్వారా రాగ సుధకు పరిచయమయ్యాడు. కార్తీక్ పెడుతున్న ఇబ్బందులను ఆమె ఒకసారి అతడికి చెప్పింది. దీంతో కార్తీక్ తీరు మార్చు కోవాలని సదరు స్నేహితుడు హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం గద్వాల మేళ్లచెరువు దగ్గర ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం.. అది కార్తీక్‌దే అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్నేహితుడి పాత్రపైనా అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారని సమాచారం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి