సర్కార్‌ బావిలో దారుణహత్య.. | Murder in Old Well Anantapur | Sakshi
Sakshi News home page

ఉప్పిడిపల్లి వద్ద దారుణహత్య

May 7 2019 8:24 AM | Updated on May 7 2019 8:24 AM

Murder in Old Well Anantapur - Sakshi

బావిలో గుర్తించిన కాలిన మృత దేహం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

చంపి మృతదేహాన్ని కాల్చివేసినట్లు అనుమానం

అనంతపురం, మడకశిర: మడకశిర మండలం ఉప్పిడిపల్లి వద్ద దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు లేదా మూడు రోజుల కిందట ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు గురైంది మహిళనా? పురుషుడా? అనేది గుర్తించలేని పరిస్థితిలో మృతదేహం కాలిపోయి ఉంది. గ్రామ సమీపంలో కురుబ సిద్ధప్పకు చెందిన బీడు భూమిలో కంపచెట్లు విపరీతంగా పెరిగాయి. ఈకంపచెట్ల మధ్య పాడుబడిన 20 అడుగుల లోతు గల బావి ఉంది. ఈ బావి పేరు సర్కార్‌ బావి. పూర్తిగా ఎండిపోయి ఉన్న ఈ బావిలో మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
సీఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ గోపీయాదవ్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం నడుం భాగం పూర్తిగా కాలి పోయింది. బోర్ల పడి ఉన్న మృతదేహం పక్కనే పెట్రోల్‌ క్యాన్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మృతదేహాన్ని బావి గట్టుపై కాల్చి, మళ్లీ బావిలోకి తోసి వేసి మరోసారి పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీంలను రంగంలోకి దించారు. కర్ణాటక ప్రాంతంలో హత్య చేసి శవాన్ని ఇక్కడికి తీసుకు వచ్చి కాల్చి వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి మిస్సింగ్‌ కేసులు నమోదు కాలేదు. కర్ణాటక ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్లకు కూడా సమాచారాన్ని అందించారు. ఈ ఘటనపై స్థానిక సీఐ దేవేంద్రకుమార్‌ మాట్లాడుతూ ఈకేసులో ఎలాంటి క్లూ దొరకలేదని తెలిపారు. గుర్తుతెలియని శవంగా నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement