వీడని మురళీకృష్ణ హత్య కేసు..

Murder Case Not Solved In Vizianagaram - Sakshi

పార్వతీపురం : గతేడాది జూలై 23వ తేదీ రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య పార్వతీపురం పట్టణం 21వ వార్డు ఎస్‌ఎన్‌పీ కాలనీలో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్‌. అయితే ప్రశాంతతకు మారుపేరైన పార్వతీపురం పట్టణంలో తుపాకీ ఎందుకు పేలుతుందిలే అనుకుంటూ మళ్లీ టీవీ చూడడంలో బిజీ అయిపోయారు. కానీ నిజంగానే తుపాకీ పేలిందనే విషయం రెండు గంటల తర్వాత తెలుసుకున్న ప్రజలు భీతెల్లిపోయారు.

పట్టణ నడిబొడ్డున, చుట్టూ నివాస గృహలు ఉండగా ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటనను ప్రజలు నేటికీ మరిచిపోలేకపోతున్నారు. చీకటి పడితే చాలు ఎస్‌ఎఎన్‌పీ కాలనీవాసులకు తుపాకీ పేలిన శబ్దాలే వినిపిస్తున్నాయి. పట్టణ ప్రధాన రహదారిలోని సుమిత్రా కలెక్షన్స్‌ వ్యాపార భాగస్వామి పొట్నూరు మురళీకృష్ణ 2017 జూలై 23న విధులు ముగించుకుని రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు.

ద్విచక్ర వాహనం ఆపి దిగుతుండగా మెరుపు వేగంతో కొంతమంది వచ్చి తుపాకీతో తలపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ సంఘటనలో మురళీకృష్ణ అక్కడికక్కడే కన్నుమూశాడు. పోలీసులు సంఘటనా స్థలంలో బుల్లెట్, దాని తొడుగు (కోకా) సేకరించారు. సంఘటన జరిగి ఏడాది పూర్తయినా ఇంతవరకు నేరస్తులను పోలీసులు పట్టుకోలేపోయారు.

సహకారం కరువు

మురళీకృష్ణ హత్య కేసు విషయమై పోలీసులకు అతని కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా సహకారం అందలేదని సమాచారం. ఎక్కడైనా ఒకరు హత్యకు గురైతే నిందితులను పట్టుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అలాగే అనుమానితుల వివరాలు కూడా అందజేస్తారు. ఈ కేసుకు సంబంధించి మాత్రం మురళీకృష్ణ భార్య గాని, తల్లిదండ్రులు గాని, బంధువులు గాని ఎవ్వరూ పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సవాల్‌గా మారిన కేసు ...

ప్రస్తుతం సాంకేతికరంగం ఎంతో అభివృద్ధి చెందింది. టెక్నాలజీ సహాయంతో ఎన్నో కేసులను సులువుగా ఛేదించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదో అర్థం కావడం లేదు. 20 బృందాలు మూడు రాష్ట్రాల్లో తనికీ చేయగా.. వేల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించినా నిందితులు పట్టుబడలేదు. దీంతో ఈ కేసు పోలీసులక సవాల్‌గా మారింది.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top