అర్ధరాత్రి అగ్ని బీభత్సం

Mid Night Fire Accident In Vizianagaram  - Sakshi

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్నట్యాంకర్‌

ఉవ్వెత్తున ఎగిసి పడిన మంటలు

పొలాల్లోకి పరుగులు తీసిన ప్రజలు

ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం

ఏడు పశువుల శాలలు, వాహనాలు దగ్ధం కావడంతో

రూ. రెండు లక్షల ఆస్తి నష్టం

రామభద్రపురం: అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సరిగ్గా 12 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. శనివారం అర్ధరాత్రి రామభద్రపురం మండల కేంద్రంలో సాలూరు వైపు వెళ్తున్న 26వ నంబర్‌ జాతీయ రహదారి పక్కనున్న చందానవీధి వద్ద  విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. పోలీసులు తెలియజేసిన వివరాలు ఉన్నాయి. విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ నుంచి నాప్తా పెట్రోలియం రసాయనాన్ని తీసుకువెళ్తున్న ట్యాంకర్‌ సాలూరు, ఒడిశా మీదుగా రాజస్థాన్‌ వెలుతోంది. సరిగ్గా రామభద్రపురం మండల కేంద్రంలోని  చందానవీధి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న 100 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ట్యాంకర్‌ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్‌ నుంచి భారీ శబ్ధం రావడంతో డ్రైవర్, క్లీనర్‌ కిందకు దూకేశారు. ట్యాంకర్‌లోని రసాయనం ట్రాన్స్‌ఫార్మర్‌ మీద పడడంతో భారీ మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్లు వెంటనే స్పందించి గట్టిగా కేకలు వేస్తూ సమీపంలోని ఇళ్లల్లో ఉన్నవారిని  లేపారు. స్థానికులు లేచేసరికి భారీ అగ్నికీలలు కనిపించడంతో భయాందోళనకు గురై ఇళ్లముందున్న పశువుల శాలల్లోని పశువులను ఇప్పేసి సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

పేలిన ట్యాంకర్‌
విషయం తెలుసుకున్న సాలూరు, బాడంగి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ట్యాంకర్‌కు మంటలు అంటుకోవడంతో ఎక్కడ పేలుతుందోనని భయపడుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ట్యాంకర్‌ సుమారు రెండు గంటల పాటు కాలింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను చూసి జనం కకావికలమయ్యారు. చందానవీధితో పాటు సమీప వీధుల్లోని ప్రజలు ఇళ్లల్లోని గ్యాస్‌ దిమ్మలను బయట పడేసి బతుకు జీవుడా అంటూ సమీప పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏడు పశువుల శాలలు, తొమ్మిది విద్యుత్‌ మీటర్లు, ఒక మోటార్‌ సైకిల్, నాలుగు సైకిళ్లు కాలిపోగా, ఒక మేక, ఆవు గాయపడ్డాయి. అలాగే చిరువ్యాపారి అయిన ఊద చిన్నమ్మతల్లికి చెందిన సుమారు 25 వేల రూపాయల విలువ చేసే సిల్వర్‌ సామాన్లు కాలిపోయాయి. సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, టీటీడీ పాలక మండలి సభ్యుడు చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు డబ్ల్యూఎన్‌ రాయులు, పూడి సత్యం, డర్రు పైడిరాజు, చింతల రామకృష్ణ, మడక తిరుపతినాయుడు బాధితులను పరామర్శించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top