వివాహేతర సంబంధం.. వివాహిత పరువు హత్య | Married Women Murdered in Tamil nadu | Sakshi
Sakshi News home page

వివాహిత పరువు హత్య

May 27 2019 11:49 AM | Updated on May 27 2019 11:49 AM

Married Women Murdered in Tamil nadu - Sakshi

రాధిక (ఫైల్‌)

తమిళనాడు, టీ.నగర్‌: కముది సమీపంలో వివాహేతర సంబంధం, మహిళ హత్యకు దారితీసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆరుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా, అభిరామం సమీపంలోని డి.వల్లకుళానికి చెందిన మాయాండి కుమార్తె రాధిక (22)కు, పిచ్చయప్పనేందల్‌ గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌(30)తో గత రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భర్తతో గొడవ పడి దీంతో ఏడాది క్రితం పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతానికి చెందిన కరుప్పసామి (22)తో రాధికకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. గత ఏప్రిల్‌ 22న మరో సారి బంధువులకు పట్టుబడడంతో కరుప్పసామిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె మాయమైంది. ఏప్రిల్‌ 30న కాలిపోయిన స్థితిలో రాధిక మృతదేహం కనిపించింది. అక్కడ లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాధిక పేర్కొంది.

దీన్ని ఆత్మహత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. కానీ రాధికా బంధువులు మాత్రం ఆమె ప్రియుడే హతమార్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హంతకులను అరెస్టు చేయాలని, నష్టపరిహారం చెల్లించా లని ఆందోళనలు జరిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి రాధిక తల్లిదండ్రులకు రూ.4.12  లక్షలు నష్టపరిహారం ఇప్పిం చారు. అయితే రాధిక బంధువులు మురుగన్‌ (24), మోహన్‌ (20) అళగర్‌సామి (23), మనియసామి (40) పాప్పా (50), మరో 17 ఏళ్ల బాలుని అభిరామం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. రాధికా సెల్‌ఫోన్‌తో తరచుగా సంప్రదించిన 17 ఏళ్ల బాలుడిని విచారించగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వేరొక కులానికి చెందిన వ్యక్తితో రాధిక వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో హత్య చేసేందుకు బంధువులు నిర్ణయించారని, దుడ్డుకర్రలతో ఆమెను హతమార్చి మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టారని తెలిపారు. రాధిక రాసినట్లు ఒక లేఖను 17 ఏళ్ల బాలునితో రాయించారని, రాధికను ఆమె తల్లి కస్తూరి వెదకడం తెలుసుకున్న హంతకులు మృతదేహాన్ని రాత్రి వేళ ఊరి వెలుపల పారేసి నిప్పంటించి కాల్చినట్లు విచారణలో తేలిందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement