నీ భార్య నేనూ పెళ్లి చేసుకుంటాం.. వదిలేయ్ | Man Suicide Facebook Love Failure in West Godavari | Sakshi
Sakshi News home page

విషాదం నింపిన ఫేస్‌బుక్‌ ప్రేమ

Aug 4 2018 6:45 AM | Updated on Nov 6 2018 8:16 PM

Man Suicide Facebook Love Failure in West Godavari - Sakshi

వెంకటేష్‌ (23) మృతదేహాన్ని పరిశీలిస్తున్న అల్లు దుర్గారావు , వెంకటేష్‌ (ఫైల్‌)

పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ఒక వివాహితతో ఒక యువకుని ప్రేమ వ్యవహారం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఫేస్‌బుక్‌ పరిచయంతో యువతిపై ప్రేమను పెంచుకున్న ఆ యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందే ఆ యువతి, ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పోలీస్‌ క్వార్టర్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్‌ కంపా వెంకటరమణ కుమారుడు కంపా వెంకటేష్‌ (23) క్వార్టర్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కంపా వెంకటేష్‌కు ఫేస్‌బుక్‌లో తూర్పుగోదారి జిల్లా రాజమహేంద్రవరం వాంబే కాలనీకి చెందిన ఓ వివాహితతో పరిచయమైంది. ఆమె రాజమహేంద్రవరంలోని దివాన్‌ చెరువు వద్ద ఒక బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కంపా వెంకటేష్‌ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. వివాహిత అమ్మమ్మది జంగారెడ్డిగూడెం కావడంతో వెంకటేష్‌కు, వివాహితకు మధ్య స్నేహం పెరిగింది. దీంతో వెంకటేష్‌ ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వివాహిత భర్తకు వెంకటేష్‌ ఫోన్‌ చేసి ‘నీ భార్య నేను పెళ్లి చేసుకుంటామని, ఆమెను వదిలివేయాలని’ చెప్పాడు.

దీంతో మనస్తాపానికి గురైన ఆమె భర్త గత నెలలో రాజమహేంద్రవరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వివాహిత వెంకటేష్‌కు ఫోన్‌ చేసి తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నువ్వే కారణమని చెప్పి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని వెంకటేష్‌కు తెలిపింది. గత నెలలో వివాహిత జంగారెడ్డి గూడెం వచ్చింది. తర్వాత వెంకటేష్‌ వివాహితను తన స్కూటీపై ఎక్కించుకుని రాజమహేంద్రవరం వెళ్లారు. కొవ్వూరు రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో వివాహిత కొవ్వూరు బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై అప్పట్లో కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్‌ను విచారించారు. అప్పటి నుంచి అన్యమనస్కుడైన వెంకటేష్‌ చివరికి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై అల్లు దుర్గారావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement