సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కు స్వస్తి పలికి.. ‘పొట్లం’ యాప్‌కు శ్రీకారం.. ఏటా రూ.6 కోట్ల టర్నోవర్‌

Potlam APP Success In Jangareddy Gudem Andhra Pradesh - Sakshi

ఉద్యోగానికి స్వస్తి పలికి ‘పొట్లం’ యాప్‌కు శ్రీకారం చుట్టిన యువకుడు

ఆ యువకుడిది.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక సామాన్య రైతు కూలీ కుటుంబం. చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయినా, తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ అతడిని పెంచి పెద్ద చేసింది. పేదరికంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే సాగింది. బీఏ మాత్రమే చదివినా పట్టుదలతో ఐటీ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయ్యాడు. యాక్సెంచర్, విప్రో వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో పనిచేశాడు. అంతటితో ఆగని ఆ యువకుడు ‘పొట్లం’ పేరుతో ఆహారం, సరుకులను డోర్‌ డెలివరీ చేసే యాప్‌కు శ్రీకారం చుట్టాడు.

చదువుకునేటప్పుడే ఖర్చుల కోసం కిరాణా కొట్టులో పనిచేస్తూ ‘పొట్లం’ కట్టిన ఆ యువకుడు ఇప్పుడు తన సొంత ఊరు జంగారెడ్డిగూడెం కేంద్రంగా 200 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పొట్లం యాప్‌ ద్వారా ఐదు పట్టణాల్లో ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలను డోర్‌ డెలివరీ చేస్తున్నాడు. తన వ్యాపారం ద్వారా ఏటా రూ.6 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం... అనే మాటను రుజువు చేస్తున్న ఆ యువకుడే.. శ్రీనివాస్‌ అలమండ. అతడి స్ఫూర్తిదాయక విజయగాథ ఇది..

సాక్షి, అమరావతి: పేదరికం కారణంగా అలమండ శ్రీనివాస్‌ ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే సమయంలో ఖర్చుల కోసం అనేక పనులు చేశాడు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ నెలకు రూ.1,500 జీతంతో ఉద్యోగం చేశాడు.

ఇంగ్లిష్, అమీర్‌పేటలో ఐటీ కోర్సులు నేర్చుకుని యాక్సెంచర్, విప్రో కంపెనీల్లో 17ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, కెనడాల్లోనూ కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అయితే, సొంత ఊరు జంగారెడ్డిగూడెంపై మమకారంతో తిరిగి వచ్చేశాడు. ఏదైనా మొబైల్‌ యాప్‌ తయారు చేయాలనే లక్ష్యంతో తన స్నేహితులు హరికృష్ణ, రఘు, సోదరుడు పవన్‌లతో కలిసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా 2020లో పొట్లం రిటైల్‌ కాన్సెప్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ‘పొట్లం ఫుడ్‌ అండ్‌ కిరాణా యాప్‌’కు శ్రీకారం చుట్టాడు.

లక్ష మందికిపైగా వినియోగదారులు
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన పొట్లం ఫుడ్‌ అండ్‌ కిరాణా యాప్‌కు ప్రస్తుతం లక్ష మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. పొట్లం యాప్‌ ద్వారా జంగారెడ్డిగూడెం, ఏలూరు, తణుకు, నర్సీపట్నం, సత్తుపల్లి పట్టణాల్లో వినియోగదారులకు నిత్యం ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, మాంసాన్ని డోర్‌ డెలివరీ చేస్తున్నారు. పొట్లం యాప్‌ ద్వారా శ్రీనివాస్‌ ఏటా రూ.6 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నారు. పొట్లంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

2020లోనే పొట్లం మొదటి డార్క్‌ స్టోర్‌
పొట్లం యాప్‌ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా సరుకులు అందించేలా 2020 ఆగస్టులో జంగారెడ్డిగూడెంలో మొదటి డార్క్‌స్టోర్‌ను శ్రీనివాస్‌ ఏర్పాటు చేశాడు. వినియోగదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా పొట్లం ఆన్‌లైన్‌ యాప్, ఆఫ్‌లైన్‌ (ఫోన్‌ ద్వారా)లో ఆర్డర్‌ ఇస్తే సరుకులు డార్క్‌స్టోర్‌ నుంచి సిబ్బంది డోర్‌ డెలివరీ చేస్తున్నారు. 

రైతుకి వెన్నుదన్ను..
వ్యవసాయ కూలీ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీనివాస్‌ పొట్లం యాప్‌ ద్వారా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా అక్కడికక్కడే మంచి ధర దక్కేలా చేస్తున్నాడు. దీనిద్వారా ఓవైపు రైతులకు దళారీల బాధ లేకుండా మంచి ధర దక్కుతుంటే.. వినియోగదారులకు తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరకే అందుతున్నాయి. మార్కెట్‌ ధరల కంటే కనీసం 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను డోర్‌ డెలివరీ చేస్తున్నాడు. బయట మార్కెట్‌లో దాదాపు రూ.400 విలువ చేసే 17 రకాల కూరగాయలను కేవలం రూ.199కే డోర్‌ డెలివరీ ఇస్తున్నాడు.

నిరక్షరాసులు సైతం..
ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయాలంటే స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్, చదువు తప్పనిసరి. ప్రస్తుతం బహుళజాతి సంస్థల యాప్‌లన్నీ ఈ కోణంలోనే ఉన్నాయి. కానీ పొట్లం యాప్‌ మాత్రం వీటికి భిన్నంగా ఆఫ్‌లైన్‌ విధానంలోనూ సేవలు అందిస్తోంది. పొట్లం వినియోగదారుల్లో చాలామంది స్మార్ట్‌ ఫోన్‌ లేనివారే అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ ఫోన్‌ లేకపోయినా కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి ఆర్డర్‌ ఇస్తే నేరుగా ఇంటికి సరుకులు పంపే ఏర్పాటు ‘పొట్లం’ ప్రత్యేకత.

కరోనా సమయంలోనూ ఉపాధి
2020లో కరోనా సమయంలో పొట్లం యాప్‌ను ప్రారంభించా. ఆ సమయంలో ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల టీచర్లు చాలామంది ఉపాధి కోల్పోయి పొట్లం యాప్‌లో డెలివరీ బాయ్స్‌గా చేరారు. కరోనా కష్టకాలంలో ఏ ఉద్యోగం లేక రోజు గడవడం కష్టమైన చాలామందికి ఉపాధి కల్పించా. ఔత్సాహిక యువతకు మొదటి పది బ్రాంచ్‌లకు పొట్లం ఫ్రాంచైజీ ఉచితంగా ఇస్తా. ఫుల్లీ ఆటోమేటెడ్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ ద్వారా మొత్తం 14 యాప్‌ల అనుసంధానంతో పొట్లం యాప్‌ పనిచేస్తోంది.

పొట్లం ఫ్రాంచైజీని ఉచితంగా ఎవరైనా తమ ప్రాంతంలో తీసుకోవడానికి యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 నాటికి రాష్ట్రంలో ఐదు వేల కేంద్రాలకు పొట్లం యాప్‌ను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నా. అధునాతన మెషీన్‌ లెర్నింగ్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)లను జోడించి వినియోగదారులకు సేవలందిస్తున్నా. 
– శ్రీనివాస్‌ అలమండ, ఎండీ, పొట్లం రిటైల్‌ కాన్సెప్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top