
సాక్షి,జంగారెడ్డిగూడెం: వినాయక చవితి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న ఓ అరుదైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సుబ్రహ్మణ్యం అనే భక్తుడు తన నివాసంలో పసుపుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి పూజ గదిలో ప్రతిష్టించారు.
పూజ అనంతరం, ఆ విగ్రహం వద్దకు ఓ మూషికం (ఎలుక) ప్రత్యక్షమై సుమారు రెండు గంటల పాటు వినాయకుడి చుట్టూ తిరుగుతూ సందడి చేసింది. ఈ దృశ్యం గణేశుని వాహనమైన మూషికాన్ని గుర్తుచేస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
పురాణాల ప్రకారం, మూషికం అహంకారాన్ని, లోపాలను సూచించే ప్రతీకగా భావించబడుతుంది. గణేశుడు వాటిని అధిగమించే శక్తిగా పూజించబడతాడు. ఈ నేపథ్యంలో, వినాయక విగ్రహం వద్ద మూషికం స్వయంగా ప్రత్యక్షమవడం దైవ అనుగ్రహంగా భావిస్తూ భక్తులు హారతులు ఇచ్చి, ప్రసాదం అందించి, నీళ్లు పోసి ఆ మూషికానికి పూజలు నిర్వహించారు.
ఈ వింత సంఘటన స్థానికంగా భక్తి, విశ్వాసం, శుభసూచకతకు ప్రతీకగా మారింది. ఈ వింతపై సమాచారం అందుకున్న భక్తులు గణేశుని వాహనంగా భావించిన మూషికాన్ని దర్శించేందుకు తరలివచ్చారు. పసుపు వినాయకుడి వద్ద మూషికం చేసిన విన్యాసాలు ఆధ్యాత్మిక అనుభూతికి దారితీశాయని భక్తులు భావిస్తున్నారు.