‘సూరత్‌’ రియల్‌ హీరో

man saved two girls from deadly Surat coaching centre fire accident - Sakshi

ప్రాణాలకు తెగించి ఇద్దరు విద్యార్థులను కాపాడిన కేతన్‌

భవన యజమాని అరెస్ట్‌

అదనపు సీఎస్‌ నేతృత్వంలో విచారణ

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న కోచింగ్‌ సెంటర్‌లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్‌ జొరవాడియా అనే యువకుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు.

తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్‌ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ  కేతన్‌ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

22కు చేరుకున్న మృతులు
తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఈ విషయమై సూరత్‌ ఏసీపీ పీఎల్‌ చౌధరి మాట్లాడుతూ.. మృతుల్లో 18 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారని తెలిపారు. ఓ నాలుగేళ్ల చిన్నారికి కూడా ఈ సందర్భంగా కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువమంది 18 ఏళ్లలోపువారే. కోచింగ్‌ సెంటర్‌లో తగిన సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.  

భవన యజమాని అరెస్ట్‌..
పలువురు విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్‌ బుటానిని అరెస్ట్‌ చేశామని ఏసీపీ పీఎల్‌ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్‌ వెకరియా, జిగ్నేశ్‌ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు.

ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో ముగ్గురు విద్యార్థులు శనివారం వెలువడ్డ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. యశ్వీ కేవదీయా 67శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, మాన్సీ వర్సని 52 శాతం, హస్థీ సురానీ  69శాతం మార్కులతో పాసయ్యారు’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లలో అగ్నిప్రమాదాల సందర్భంగా తప్పించుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయమై ఆడిట్‌ చేపట్టాలని సీఎం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే సూరత్‌ అగ్నిప్రమాదంపై అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు.


మృతులకు నివాళులర్పిస్తున్న సూరత్‌ విద్యార్థినులు
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top