ఫేస్‌ బుక్‌లో ప్రేమ.. హత్యకు కుట్ర | Sakshi
Sakshi News home page

ఫేస్‌ బుక్‌లో ప్రేమ.. హత్యకు కుట్ర

Published Sun, Dec 1 2019 9:06 AM

Malaysian Woman Sent Gang To Murder To His Boyfriend Tamil Nadu Police Arrested - Sakshi

అన్నానగర్‌: వీరపాండి సమీపంలో వివాహానికి అంగీకరించని ఫేస్‌బుక్‌ ప్రేమికుడిని హతమార్చడానికి మలేషియా మహిళ పంపిన కూలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తేని జిల్లా వీరపాండి సమీపంలో ఉన్న కాట్టునాయక్కన్‌ పట్టికి చెందిన అశోక్‌ కుమార్‌ (28) బెంగళూర్‌లో ఉన్న ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్‌ ద్వారా మలేషియాకు చెందిన అముదేశ్వరి పరిచయమైంది. కాలక్రమేణా ప్రేమగా మారింది. తరువాత అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ స్థితిలో మలేషియా నుంచి కవితా అరుణాచలం అనే మహిళ, అశోక్‌కుమార్‌ సెల్‌ఫోన్‌కి కాల్‌ చేసి మాట్లాడింది. ఆమె తనను అముదేశ్వరి అక్క అని, వివాహం చేసుకోకపోవడం వల్ల అముదేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది.  అశోక్‌ కుమార్‌ దిగ్భ్రాంతి చెందాడు. ఇంకా ఆమె పనిచేసిన సంస్థలో ఆ మహిళ ఫిర్యాదు చేసింది.

అనంతరం మలేషియా నుంచి తమిళనాడు వచ్చిన కవితా అరుణాచలం... అక్టోబర్‌ 30న అశోక్‌ కుమార్‌ను కలిసింది. అప్పుడు ఆమె తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అశోక్‌కుమార్‌ దీనిపై తేని పోలీసులకి సమాచారం అందించాడు. పోలీసులు ఆ మహిళ వద్ద విచారణ చేశారు. ఇందులో 45 ఏళ్లు గల ఆ మహిళ, అముదేశ్వరి, కవితా అరుణాచలం అనే పేరుతో అశోక్‌కుమార్‌ వద్ద మాట్లాడినట్లు తెలిసింది. తరువాత ఆమెని పోలీసులు హెచ్చరించి పంపారు.

ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి అని తెలిసింది. ఈ స్థితిలో తనను వివాహం చేసుకోకుండా మోసం చేసిన అశోక్‌కుమార్‌ని చంపటానికి 9 మంది కూలీ ముఠాను పంపింది. వారు శుక్రవారం బోడి సమీపంలో ఉన్న ప్రైవేట్‌ లాడ్జీలో ఉండగా వారి ప్రవర్తన మీద అనుమానం చెందిన లాడ్జీ కార్మికులు బోడి టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. ఇందులో అశోక్‌కుమార్‌ని హత్య చెయ్యడానికి విఘ్నేశ్వరి పంపించిన కూలీ ముఠ అని తెలిసింది. తరువాత పోలీసులు కేసు నమోదు చేసి అన్బరసన్‌ (24), మునుస్వామి (21), అయ్యనార్‌ (39), మురుగన్‌ (21), జోసఫ్‌ (20), యోగేష్‌ (20), కార్తిక్‌ (21), దినేష్‌ (22), భాస్కరన్‌ (47)ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా వారి నుంచి కారు, కత్తి వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విఘ్నేశ్వరి కోసం గాలిస్తున్నారు. 

Advertisement
Advertisement