తీర్థయాత్రలో కన్నీటిసుడి

karnataka People Died in East Godavari Bus Accident - Sakshi

తూర్పుగోదావరి జిల్లాలో టూరిస్టు వాహనం బోల్తా  

మృతుల్లో ఐదుగురు చెళ్లకెరవాసులు  

24 మందితో శనివారం యాత్రకు పయనం

శోకసంద్రంలో బాధిత కుటుంబాలు

కర్ణాటక ,చెళ్లకెర రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో టూరిస్టు బస్సు లోయలోకి పల్టీ కొట్టిన ప్రమాదంలో ఏడుగురు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు మృతులు కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరకు చెందిన ఆర్యవైశ్య కుటుంబాలవారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లి ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రయాణం  
జిల్లాలో వ్యాపార కేంద్రమైన చెళ్లకెరలో ఆర్యవైశ్య కుటుంబాలవారు 24 మంది శనివారం రెండు టెంపో ట్రావెలర్‌ వాహనాల్లో ఏపీలో పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. మొదట శ్రీశైలం దర్శనం ముగించుకొని ముందుకు సాగిపోయారు. పెనుగొండలో వాసవీమాత దర్శనం కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఇంతలో ప్రమాద వార్త తెలిసింది. మృతుల్లో ఐదుగురు చెళ్లకెరవాసులు కాగా, ఇద్దరు అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన వారు. మృతులను చెళ్లకెరకు చెందిన కుందం రమేష్‌ (56), ఆయన భార్య కుందం అమృతవాణి (48), మేడా గాయత్రమ్మ (52), మేడా శ్వేతా (25), సావిత్రమ్మ (45)లుగా గుర్తించారు. మడకశిరకు చెందిన ఇద్దరు మేడా శ్రీనివాసులు (57), మేడా రుద్రాక్షమ్మ (56)లు మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రులను కురుడి శ్రీనివాస్, కురుడి శ్వేతా, మేడా జగన్నాథ్, మేడా వెంకటేశ్వర్లు, జ్ఞానశ్రీలుగా గుర్తించారు.  

చెళ్లకెరలో విషాద చాయలు  
ప్రమాద సమాచారాన్ని టీవీలలో చూసిన వెంటనే చెళ్లకెర ఆర్యవైశ్య సంఘం వారు దిగ్బ్రాంతికి గురయ్యారు. నీ ఆరోగ్యం జాగ్రత్త అని పర్యటనకు వెళ్లే ముందు అక్క జాగ్రత్తలు చెప్పిందని, కానీ తానే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని మృతురాలు శ్వేత తమ్ముడు అశోక్‌ విలపిస్తూ చెప్పాడు. మరో మృతుల బంధువు అశ్వత్‌ నారాయణశెట్టి మాట్లాడుతూ మృతురాలు సావిత్రమ్మ కుమారుడు నాదగ్గరే ఉన్నాడు, ఈ ఘోరం ఎలా చెప్పాలి అని దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని కన్నీరు కార్చాడు.  

యాత్రకు వెళ్లింది వీరే  
తీర్థయాత్రకు వెళ్లినవారు: రంగనాథ, సుధా, గోవిందరాజు, మమతా, కృష్ణమూర్తి, రాధా, బృందా, జగన్నాథ్, రామలక్ష్మి, వెంకటచలపతి, సావిత్రమ్మ, శ్వేతా, గీతమ్మ, శ్వేతా, ఏఎస్‌.మారుతీ, ఎస్‌.లక్ష్మి, శ్రియా, కిశోర్, మారుతి, రమేష్, వాణి, కే.శ్రీనివాస్‌ అని తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top