కర్ణాటకలో సైకో వైద్యుడి నిర్వాకం

Karnataka Doctor arrested for torching 20 cars  - Sakshi

పగలు వైద్య వృత్తి...రాత్రయితే కార్లకు నిప్పు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి, బెంగళూరు : అతనో సీనియర్‌ వైద్య నిపుణుడు. కానీ చీకటి పడగానే అతగాడిలోని సైకో అవతారం బయటకొస్తుంది. కొద్దిరోజులుగా ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్లకు నిప్పు పెడుతూ కలబురిగి, బెళగావి నగరవాసులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అయితే ఎట్టకేలకు నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కలబురిగికి చెందిన అమిత్‌ గైక్వాడ్‌ బెళగావిలోని బిమ్స్‌ వైద్య కళాశాలలో వైద‍్యుడిగా, ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అమిత్‌ కొద్దిరోజులుగా కలబురిగి, బెళగావిలో ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్లకు రాత్రి వేళల్లో నిప్పు పెట్టడం అలవాటుగా మారింది.

మూడు రోజుల క్రితం కూడా బెళగావిలో ఏపీఎంసీ లే అవుట్‌లోని ఎనిమిది కార్లకు గైక్వాడ్‌ నిప్పు పెట్టాడు. అంతకు ముందు కలబురిగిలో ఏడు కార్లను దహనం చేశాడు. బుధవారం రాత్రి కూడా బెళగావి సదాశివనరగ్‌లో కారుకు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు గైక్వాడ్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అమిత్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు... అతడి వద్ద నుంచి నిప్పు పెట్టడానికి వినియోగిస్తున్న కర్పూరం, పాత బట్టలు, పెట్రోల్‌, కత్తుల స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనాలకు నిందితుడు ఎందుకు నిప్పుడు పెడుతున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top