అక్రమార్కులకు కలపతరువు

Illegal Smuggling Of Red Sandal In Vizianagaram - Sakshi

అడవులను కొల్లగొడుతున్న స్మగ్లర్లు

విలువైన కలప తరలించుకుపోతున్న వైనం

సామిల్లుల్లోనే యథేచ్ఛగా నిల్వ

వరుసగా పట్టుబడుతున్న ఎర్రచందనం

హుద్‌హుద్‌ తుఫాన్‌కు కూలిన కలపంటూ కలరింగ్‌

చెక్‌పోస్టుల్లో కనిపించని తనిఖీలు

అడపాదడపా దృష్టిసారిస్తేనే వందల్లో కేసులు

చుట్టూ విశాలమైన అటవీప్రాంతాలు... అందులో అత్యంత విలువైన కలపనిచ్చే వృక్షాలు... పర్యావరణానికి తోడ్పడే అనుకూల వనాలు... ఇదీ విజయనగరం జిల్లా అనగానే గుర్తుకొచ్చే అంశాలు. కానీ ఇప్పుడు ఆ వనాలపై అక్రమార్కుల కన్ను పడింది. దానికి అధికారుల ఉదాశీనత తోడైంది. నామమాత్రంగానైనా ఏర్పడిన చెక్‌పోస్టుల పర్యవేక్షణ కొరవడింది.

అందుకే దొరికిన కలపను ఎంచక్కా టింబర్‌డిపోల్లోనే నిల్వ చేస్తున్నారు. అక్కడ తమకు అనువైన రీతిలో తీర్చిదిద్దుతున్నారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా ఇతర జిల్లాలు... రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సాక్షిప్రతినిధి, విజయనగరం : జిల్లా అడవుల్లో టేకు ఎక్కువగా లభిస్తుంది. దాని తర్వాత స్థానంలో ఎర్రచందనం ఉంది. హుద్‌హుద్‌ తుఫాన్‌కు పడిపోయిన ఎర్రచందనం కలప సుమారు 13 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనిని కొందరు పోగుచేసి నిల్వచేసుకున్నారు. ఆ కలపను తరలించడానికి అనుమతినివ్వాలంటూ 10 మంది మాత్రమే ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకున్నారు. చాలా మంది అక్రమంగా స్మగ్లింగ్‌ చేసేస్తున్నారు.

సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో జాతీయరహదారి 26పై పి.కోనవలస గేటు వద్ద మార్కెట్‌యార్డు, ఎక్సైజ్, అటవీశాఖల చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇన్ని చెక్‌పోస్టులు ఉన్నా ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య అటవీ సంపద అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది.

పట్టుబడిన కలపకు హుద్‌హుద్‌ కలరింగ్‌

ఇటీవల జిల్లాలో వరుసగా ఎర్రచందనం పలుచోట్ల పట్టుబడింది. అయితే అది హుద్‌హుద్‌ సమయంలో కొట్టుకొచ్చిన కలప అని నిందితులు చెప్పుకొచ్చారు. సుమారు 10 టన్నులకు పైగానే ఉన్న ఎర్రచందనాన్ని ఇటీవల గరివిడి మండలం, తాటిగూడ గ్రామం రెవెన్యూ పరిధిలో ఉన్న మాంగనీస్‌ మైన్‌లో అటవీ అధికారులు పట్టుకున్నారు. గత ఫిబ్రవరి నెలలో జిల్లాలోని గంట్యాడ మండలం రామవరం గ్రామంలో కాకర్లపూడి రామకృష్ణంరాజు ఇంటిలో అద్దెకు ఉంటున్న బుద్దరాజు వర్మ అక్రమంగా ఎర్రచందనం నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం జరుపుతున్నారనే సమాచారంతో చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ దాడిచేసి గొడౌన్లు, పెంటకుప్పల్లో దాచి ఉంచిన కలపను బయటకు తీశారు. 

విజయనగరం మండలం కొండకరకాం గ్రామం అటవీ ప్రాంతం నుంచి ఎర్ర చందనాన్ని నిందితులు సేకరించారు. హుద్‌హుద్‌ సమయంలో పొలాల్లోకి కొట్టుకొచ్చిన ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా దొంగిలించి గోడౌన్‌కు తరలించారు. మరికొంత కలపను కొనుగోలు చేసి దానిని కూడా నిల్వ చేశారు. ఈ సమాచారంతో అధికారులు కొండకరకారం, దాని పక్కనే ఉన్న కొండవెలగాడ గ్రామాల్లో విచారణ చేపట్టారు. 

గతేడాది డిసెంబర్లో ఎర్రచందనాన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా జిల్లా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం జిల్లా టీడీపీకి చెందిన కీలక నేతకు సంబంధించిన టింబర్‌ డిపోలో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం నిల్వలు కనిపించాయి. అయితే అవి హుద్‌హుద్‌ తుఫాన్‌లో సేకరించినవని, అనుమతుల కోసం దరఖాస్తు చేశామని నిర్వాహకులు చెప్పుకోవడం గమనార్హం.

అనుమతులు లేకపోతే చర్యలు తప్పవు:

హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో పడిపోయిన ఎర్ర చందనం చెట్లకు సంబంధించి అటవీశాఖకు తెలియజేసి, అనుమతులు తప్పకుండా తీసుకోవాలి. అనుమతులు తీసుకోకుండా ఎర్రచందనం నిల్వలున్నట్లు ఎక్కడైనా మేం గుర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 10 మంది అనుమతులు తీసుకున్నారు. 10 టన్నుల లోపు ఉన్న ఎర్ర చందనం చెట్లకు అనుమతులు ఇస్తాం.

ఏ కలప రవాణాకైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని డీఎఫ్‌ఓ, స్క్వాడ్‌ డీఎఫ్‌ఓలు పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేస్తాం. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశాం.

– గంపా లక్ష్మణ్, జిల్లా అటవీశాఖ అధికారి, (టెరిటోరియల్‌) ,విజయనగరం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top