భార్య గర్భిణి అని కూడా చూడకుండా.. | Husband Assassinated Pregnant Wife in Kurnool | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కాలయముడు

Mar 16 2020 11:55 AM | Updated on Mar 16 2020 11:55 AM

Husband Assassinated Pregnant Wife in Kurnool - Sakshi

సుస్మిత, ప్రతాప్‌ పెళ్లినాటి ఫొటో

కర్నూలు ,ఆళ్లగడ్డ:  కట్టుకున్నోడే కాలయముడయ్యాడు.  భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా  అతి కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లయిన ఏడాదిలోపే ఈ దారుణానికి ఒడిగట్టాడు. శనివారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలు..  

బనగానపల్లె పట్టణానికి చెందిన సుంకన్న, లక్ష్మీదేవి  దంపతుల కూతురు సుస్మిత (19).  ఈ యువతి చిన్నతనంలోనే తల్లి మృతి చెందడంతో తండ్రి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన మస్తానమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. మారు తల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి సుస్మితను  నానా ఇబ్బందులు పెట్టేది. భరించలేక  ఆమె  పిన్నమ్మ, తాతల దగ్గర ఉంటూ ఇంటర్‌ పూర్తి చేసింది. తర్వాత మస్తానమ్మ.. భర్తపై ఒత్తిడి చేసి సుస్మితను తన తమ్ముడు ప్రతాప్‌తో పెళ్లి  జరిపించింది. చెడు ప్రవర్తన గల మారుతల్లి  సుస్మితను కూడా ఆ వైపునకు మలిపేందుకు ప్రయత్నించేది. అందుకు అంగీకరించని ఆ యువతి వారితో కలిసి  ఇంట్లో ఉండటం ఇష్టం లేక వేరే కాపురం పెడదామని భర్త ప్రతాప్‌కు వేడుకునేది.

దీనిని జీర్ణించుకోలేని మారుతల్లి, అత్తామామలు సుస్మిత గురించి ప్రతాప్‌కు చెడుగా చెప్పేవారు. దీంతో సైకోగా మారిన అతను  భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి  భార్యకు మాయమాటలు చెప్పి  తన సొంత ఆటోలో ఎక్కించుకుని  నల్లగట్ల –బత్తలూరు   మార్గంలోని హైవే వద్దకు తీసుకుపోయాడు. అక్కడ అతి కిరాతకంగా భార్య చేతులు కట్టి నరాలు  కోసి పక్కనున్న నీటి కుంటలో పడేసి  పారిపోయాడు.  ఆదివారం నిందితుడే తమ బంధువులకు పోను చేసి హత్య విషయం చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి మృత దేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు.  వెనువెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.   బంధువులు   ఫిర్యాదు మేరకు హతురాలి భర్త ప్రతాప్, బావ భాస్కర్, మారుతల్లి మస్తానమ్మ, అత్తామామలు లక్ష్మీదేవి, వీరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement