కుమార్తె గొంతుకోసి.. భార్య ఉసురు తీసి!

Husband Arrest in Wife And Daughter Murder Case Prakasam - Sakshi

భార్య, కుమార్తె హత్య కేసులో భర్త అరెస్ట్‌

ముందు కుమార్తెను చంపి.. ఆపై భార్యను కడతేర్చినట్లు నిర్ధారణ

కేసు వివరాలు వెల్లడించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

ఒంగోలు: తల్లీకుమార్తె దారుణ హత్య కేసులో నిందితుడు ఆ ఇంటి యజమాని అద్దంకి కోటేశ్వరరావుగా తేలిందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ వెల్లడించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 3వ తేదీన మారెళ్లగుంటవారిపాళెం పొలాల్లో గుర్తుతెలియని తల్లి, కుమార్తె దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పెద్ద కొత్తపల్లి వీఆర్వో షేక్‌ ఆరీఫా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి సుమారు 70 మందికిపైగా అధికారులు, సిబ్బంది దీనిపై కసరత్తు చేస్తూ మృతుల ఆచూకీని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమికంగా లభించిన క్లూ ఆధారంగా బ్లూ కలర్‌ గ్లామర్‌ మోటార్‌బైక్‌ ఎవరెవరికి విక్రయించారనే సమాచారాన్ని షోరూంల ద్వారా సేకరించారు. పెట్రోల్‌ బంకులు, హైవేపై ఉన్న సీసీ కెమెరాలు, వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు, ఆస్పత్రులు, పసిబిడ్డను గుర్తిచేందుకు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆస్పత్రుల్లో సైతం సమాచారం సేకరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా మృతుల ఫొటోలు, నిందితుడి ఊహాచిత్రం గీయించి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమానం కూడా ప్రకటించారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన వారి కేసులను జల్లెడ పట్టారు. సుమారు 150 నుంచి 200 వరకు అదృశ్యమైన కేసులకు సంబంధించి వివరాలు సేకరించినా ఉపయోగం లేకపోయింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా అనుమానం వచ్చి నెల్లూరులోని అరవ జయలక్ష్మి పోలీసుల ద్వారా విషయాన్ని తెలుసుకుని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల మార్చురీలోని మృతదేహాలను పరిశీలించింది. మహిళను తన సోదరి అద్దంకి శ్రీలక్ష్మి (20)గా, పాపను ఆమె కుమార్తె అద్దంకి వైష్ణవి (11 నెలలు)గా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పథకం ప్రకారమే హత్య  
ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి భర్త అద్దంకి కోటేశ్వరరావును గురువారం ఉదయం స్థానిక మార్కెట్‌ యార్డు వద్ద ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేశారు. అనంతరం అతడిని విచారించగా పథకం ప్రకారమే హత్య చేసినట్లు మధ్యవర్తుల సమక్షంలో అంగీకరించాడు. కోటేశ్వరరావు కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతూ తిరిగి వచ్చిన తర్వాత ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018 ఏప్రిల్‌ 24న పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా సత్తెనపల్లి సమీపంలోని భీమవరం ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసుకుని ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడులో కాపురం పెట్టాడు. ఆ దంపతులకు 2019 జనవరి 17న వైష్ణవి జన్మించింది. దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం, మరో వైపు అతని తల్లిదండ్రుల ఇష్టం మేరకు భార్యాబిడ్డలను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తాను పనిచేసే ఆస్పత్రిలోని సహచర ఉద్యోగి మోటార్‌బైక్‌ తీసుకుని తన స్వగ్రామం అద్దంకి వెళ్లి కత్తి తన వెంట ఉంచుకుని బ్యాంకు పని అంటూ భార్యాబిడ్డలను బైకు ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో సీతారామపురం కొష్టాల వద్ద ఉన్న పెట్రోల్‌ బంకులో లీటర్‌ పెట్రోలు పోయించుకుని మారెళ్లగుంటపాళెం పొలాల మార్గంలోకి తీసుకెళ్లి ముందుగా కత్తితో పసిపాప గొంతు కోసి, ఆపై శ్రీలక్ష్మిని బండరాయి కేసి మోది హత్య చేసి ఆపై తన వెంట తెచ్చిన పెట్రోల్‌తో మృతదేహాలను తగులబెట్టాడు. అతని కుడిచేతికి కాలిన గాయంకాగా నేరుగా తాను పనిచేసే ఆస్పత్రికి చేరుకున్నాడు. అనంతరం కొద్దిసేపు పనిచేసి డ్యూటీ నుంచి బయటకు వెళ్లాడు. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఈ కేసులో మిగిలిన వారి పాత్రకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ వివరించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు కృషి చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, అద్దంకి సీఐ టి.అశోక్‌వర్థన్, ఒంగోలు రూరల్‌ సీఐ సుబ్బారావు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top