36 రోజుల పసికందును హతమార్చిన తండ్రి | Sakshi
Sakshi News home page

36 రోజుల పసికందును హతమార్చిన తండ్రి

Published Tue, Apr 17 2018 12:39 PM

Father Killed Girl Child In Nalgonda - Sakshi

కట్టంగూర్‌(నకిరేకల్‌) : రెండోకాన్పులోనూ ఆడపిల్ల పుట్టడం ఆ తండ్రికి ఇష్టం లేదు. పుట్టిన 36 రోజులకే ఆ పసికందును హతమార్చాడు. సిరప్‌లో పురుగుల మందు కలిపి తాగించడంతో ఆ పసికందు చనిపోయింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో జాప్యంకారణంగా నిందితుడిని ఏడాది తర్వాత అరెస్ట్‌ చేశారు. సోమవారం  కట్టంగూర్‌ పోలీస్‌స్టేషన్‌లో శాలిగౌరారం రూరల్‌ సీఐ క్యాస్ట్రోరెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కట్టంగూర్‌ మండలం ఇస్మాయిల్‌పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల ముత్తయ్య తన కూతరు పద్మను అదే గ్రామానికి చెందిన మేనల్లుడు బండారు పరుశురాములుకు ఇచ్చి వివాహం చేశాడు. పరశురాములు, పద్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. రెండో కూతురు లాస్య పుట్టిన 36 రోజులకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లి  వైద్యం చేయించారు. అప్పటికే కూతురు పుట్టడం పరశురాములుకు ఇష్టం లేదు. ఈ క్రమంలో అతను 2017, మార్చి 17న నార్కట్‌పల్లి వెళ్లాడు. స్థానిక దీపా మెడికల్‌ హాల్‌లో జ్వరానికి టానిక్‌తోపాటు ఎరువుల దుకాణంలో క్రిమి సంహాకర మందు కొన్నాడు.

తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో టానిక్‌లో క్రిమి సంహారక మందు కలిపాడు. ఇంటికి వెళ్లి టానిక్‌ను తన భార్య పద్మకు ఇచ్చాడు. దీంతో తల్లి చిన్నారికి టానిక్‌ పోసింది. టానిక్‌ తాగిన కొద్ది సేపటికే వాంతులు చేసుకోవడంతో భయాందోళనకు గురైన తల్లి తిరిగి ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లింది. చిన్నారి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పడంతో నల్లగొండకు, నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నిరాకరించటంతో హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే ఏడాది మార్చి 19న చనిపోయింది. అనుమానం వచ్చిన చిన్నారి తాతయ్య పెంజర్ల ముత్తయ్య తన మేనల్లుడు పరశురాములుపై ఫిర్యాదు చేయగా అప్పటి ఏఎస్‌ఐ యూసఫ్‌జానీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టానిక్‌ను హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపగా పరీక్షించి అందులో ఆర్గానోఫాస్ఫేట్‌ యాన్‌ ఇన్‌సెక్టిసైడ్‌ పాయిజన్‌ ఉందని రెండు రోజుల క్రితం రిపోర్ట్‌ వచ్చింది.

పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ కూడా కాజ్‌ ఆఫ్‌ డెత్‌ ఆర్గానోఫాస్‌ఫరస్‌ పాయిజన్‌ అని ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా ఎస్‌ఐ  రంజిత్‌ మర్డర్‌ కేసుగా నమోదు చేశారు. సోమవారం నిందితుడు పరశురాములును స్వగ్రామంలో పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. దీంతో నిందితుడు నార్కట్‌పల్లిలో టానిక్‌ కొనుక్కొని పురుగుల మందు కలిపి తన భార్యకు ఇవ్వటంతో చిన్నారి చనిపోయిందని,  మొదటి సంతానంతో పాటు రెండవ సంతానం కూడా కూతురు కావడంతో సాకే స్థోమత లేక చంపుకున్నానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. సమావేశంలో ఎస్‌ఐ రంజిత్‌ ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement