
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణంలో మరొకరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. శనివారం లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ బద్దం సుధాకర్‌రెడ్డిని అవినీతి ఆరోపణలతోపాటు కుంభకోణంలో ఇతరులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలతో అరెస్ట్ చేసినట్టు, జ్యుడీషియల్ కస్టడీ కోసం ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్టు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇతర అధికారులతో కలిసి కుట్ర పన్ని తమ సంస్థకు రూ. 8.25 కోట్ల మందుల కొనుగోలు ఆర్డర్‌ను సుధాకర్‌రెడ్డి సంపాదించారని ఆ ప్రకటనలో ఏసీబీ పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలతో ఈ మందులు కొనుగోలు చేశారని తెలిపింది. ఈ అరెస్ట్‌తో ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య 9కి చేరింది.