‘డబుల్‌’ పేరుతో దగా! | Double Bedroom Scheme Fraud Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ పేరుతో దగా!

Feb 19 2020 8:27 AM | Updated on Feb 19 2020 8:27 AM

Double Bedroom Scheme Fraud Gang Arrest in Hyderabad - Sakshi

నకిలీ పత్రాలను చూపిస్తున్న డీసీపీ శ్రీనివాస్‌

బంజారాహిల్స్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని అమాయక జనాన్ని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠాను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఏసీపీ కే.ఎస్‌.రావు, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. రహ్మత్‌నగర్‌లో నివసిస్తూ పని మనిషిగా జీవితం కొనసాగిస్తున్న కె.శ్రీదేవికి సొంతిల్లు లేకపోవడంతో ఇదే ప్రాంతానికి చెందిన అనుపమ అనే మహిళ డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానంది. రూ.18 వేలు చెల్లిస్తే పట్టా కూడా ఇస్తామని తన స్నేహితురాలు రజిత ఇప్పటికే చాలా మందికి ఇప్పించింది.

మాదాపూర్‌లో డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నారని చెప్పింది. దీంతో శ్రీదేవి రూ.18 వేలు చెల్లించగా ఇల్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్‌ సంతకంతో కూడిన ఓ పత్రాన్ని అందజేశారు. వీరికి జ్యోతి అనే మరో మహిళ జత కలిసి శ్రీదేవిలాగానే మరింత మందిని ఆకర్షించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరుతో 100 మంది వద్ద రూ.15 వేల నుంచి రూ.18 వేల చొప్పున రూ.15 లక్షల వరకు ఈ ముఠా వసూలు చేసింది. వీరికి టీఆర్‌ఎస్‌  టోకెన్లు, జీహెచ్‌ఎంసీ ఫేక్‌ లెటర్‌హెడ్స్‌ కూడా ఇచ్చారు.

సహకరించిన జూనియర్‌ అసిస్టెంట్‌..
రోజులు గడుస్తున్నా ఇళ్లు రాకపోయేసరికి శ్రీదేవి ఆరా తీసి ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో అనుపమ, రజిత, జ్యోతి ముగ్గురూ ముఖం చాటేశారు. బాధితురాలు ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్‌ఐ మాన్‌సింగ్‌ ముగ్గురు మహిళలను అరెస్ట్‌ చేసి విచారణ చేశారు. వీరికి లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ భూసేకరణ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహ్మద్‌ షహిర్యార్‌ అలీ అలియాస్‌ హైదర్‌ అలీ సహకరించినట్లు తేలింది. అలీ గతంలో బహదూర్‌పుర తహసిల్దార్‌ కార్యాలయంలో కూడా పని చేసినట్లు తేలింది. అలీ సహాయంతోనే నకిలీ స్టాంపులు, లెటర్‌హెడ్‌లు తయారు చేసి అమాయకులకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరుతో టోకరా వేసినట్లు తేలింది. మోసం చేసిన మేకల జ్యోతి, మందార అనుపమ, గోప లక్ష్మి, ఒగ్గు జయంతిలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు మహ్మద్‌ షహర్యార్‌ పరారీలో అతనికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి టీఆర్‌ఎస్‌ పేరుతో ఉన్న ప్లాస్టిక్‌ టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నలుగురిని అరెస్ట్‌ చేసి చీటింగ్‌ కేసులో రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement